1 July, 2026 | 3:19 PM

డాక్టర్స్ సేవలు సమాజానికి అమూల్యం

01-07-2026 02:13 PM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి):  జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం డాక్టర్లతో కలిసి కేక్ కట్ చేసి బుధవారం వేడుకలు నిర్వహించారు. అనంతరం వైద్యులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల సేవలు సమాజానికి అమూల్యమైనవని కొనియాడారు. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి వైద్యుడికి జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.