1 July, 2026 | 3:18 PM

వనపర్తి మున్సిపాలిటీలో కనిపించని సమాచార హక్కు చట్టం బోర్డు..?

01-07-2026 02:17 PM

సమాచారం కోసం ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి..?

ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడుస్తున్నారా అధికారులు..?

వనపర్తి,(విజయక్రాంతి): ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం కల్పించేందుకు తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం  వనపర్తి మున్సిపల్ కార్యాలయంలోనే కనుమరుగైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలకు అవగాహన కల్పించేలా సమాచార హక్కు చట్టం వివరాలు, ప్రజా సమాచార అధికారి వివరాలు, దరఖాస్తు విధానం వంటి సమాచారం బోర్డుల రూపంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా మున్సిపల్ కార్యాలయంలో అలాంటి బోర్డు కనిపించకపోవడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పట్టణ అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, టెండర్లు, మున్సిపల్ నిర్ణయాలపై సమాచారం తెలుసుకోవాలనుకునే ప్రజలు.. ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. ప్రజల కోసం ఉన్న చట్టం అమలులోనే కనిపించకపోతే.. ఇక సామాన్యులకు సమాచారం ఎలా అందుతుంది?" అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు

సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వనపర్తి మున్సిపాలిటీలో ఈ విషయంలో నిర్లక్ష్యం ఎందుకు కొనసాగుతోందని ప్రజలు నిలదీస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేసి, ప్రజలకు అవసరమైన వివరాలు అందుబాటులో ఉంచాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.