అధికారికంగా విమోచనదినోత్సవం
- సెప్టెంబర్ 17న ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఎగురవేయాలి
- వందేమాతర గీతాన్ని అవమానపరుస్తున్న కాంగ్రెస్
- మజ్లీస్ పార్టీకి భయపడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- పరకాలలో అమరులకు నివాళి
- భువనగిరిలో కార్యకర్తలకు పరామర్శ
పరకాల (మహబూబాబాద్)/యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): విమోచనదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, సెప్టెంబర్ 17న ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (BJP State President Ramchandra Rao) అన్నారు. వందేమాతర గీతాన్ని కాంగ్రెస్ అవమానపరుస్తోందని, మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ భయపడుతున్నాయని విమర్శించారు.
తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట హన్మకొండ జిల్లా పరకాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాంచందర్‌రావు పాల్గొన్నారు. దక్కన్ జలియన్‌వాలా బాగ్‌గా పేరుగాంచిన పరకాల అమరధామాన్ని సందర్శించి అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు.
వారి పోరాట స్ఫూర్తి, త్యాగాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. పరకాల అమరధామం చరిత్రను భావితరాలకు అందించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్లు పరకాలలో సాగించిన మారణకాండ దక్షిణ భారత జలియన్‌వాలాబాగ్‌ను తలపించిందని గుర్తుచేశారు.
గుండ్రాంపల్లిలో బావిలో పడేసి వందలాది మందిని చంపిన ఉదంతాలు, బైరాన్‌పల్లిలో గోడకు నిలబెట్టి కాల్చి చంపిన సంఘటనలు నాటి దారుణాలకు నిదర్శనాలని పేర్కొన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో ద్వారా నిజాం తలవంచడంతో సెప్టెంబర్17, 1948న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైందని గుర్తుచేశారు. నేటి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ జాతీయ గేయమైన వందేతరాన్ని అవమానపరుస్తోందని తీవ్రంగా విమర్శించారు.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మ జ్లిస్ పార్టీకి భయపడి విస్మరించిందని ఆరోపించా రు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం కూడా ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచిస్తోందే తప్ప, నిజాం వ్యతిరేక పోరాట చరిత్రను అధికారికంగా గుర్తించడం లేదని మండిపడ్డారు. పాత హైదరాబాద్ సంస్థానంలో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు.
కేంద్రంలోని భారత ప్రభుత్వం సెప్టెంబర్ 17ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా అధికారికంగా నిర్వహిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మజ్లిస్ ఓట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17 విమోచన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు అందిస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 17న తెలంగాణలోని ప్రతి పల్లెలో, ప్రతి విద్యాసంస్థలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి, వందేమాతరం, జనగణమన గీతాలను ఆలపించి అమరవీరులకు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి బూర నర్సయ్యగౌడ్, డాక్టర్ పగడాల కాళీప్రసాద్రావు, డాక్టర్ టి. రాజేశ్వరరావు, గంట రవి, రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, డాక్టర్ విజయచందర్రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోష్కుమార్, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పాల్గొన్నారు. కాగా పరకాల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాంచందర్‌రావుకు బంగారు రాఖీని నాయకుడు డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్ కట్టారు.
బీజేపీ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలి
బీజేపీ భువనగిరి జిల్లా కార్యాలయంపై దాడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. పరకాల పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో భువనగిరి బైపాస్ వద్ద కార్యకర్తలను పరామర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారమదంతో బీజేపీ కార్యకర్తలపై కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయనవెంట రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్, కార్యవర్గ సభ్యుడు తుమ్మల మురళీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చంద మహేందర్, కాటూరి అచ్చయ్య, పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, పట్టణ కౌన్సిలర్లు సుచరిత, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.






