1 July, 2026 | 3:19 PM

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్, సీఏ, పోస్టల్ డే వేడుకలు

01-07-2026 02:10 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌ భవనంలో 'లయన్స్ క్లబ్ ఆఫ్ భగత్‌నగర్' ఆధ్వర్యంలో డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్ డే, పోస్టల్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై ఆయా రంగాల నిపుణులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. భూమిపై కంటికి కనిపించే దేవుళ్లు డాక్టర్లు అని, ప్రాణదాతలుగా వారు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు. అలాగే కమ్యూనికేషన్ రంగంలో టెక్నాలజీ ఎంతగా పెరిగినా,  పోస్టల్ డిపార్ట్‌మెంట్ అందించే సేవలకు ప్రజల్లో ఇప్పటికీ ఒక నమ్మకం ఉందన్నారు.

దేశ ఆర్థిక ప్రగతికి, పన్నుల విధానాన్ని సక్రమంగా అమలు చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. నూతన నిబంధనలు, టెక్నాలజీకి అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం శ్రమించే ఈ మూడు రంగాల వారిని గుర్తించి సన్మానించడం.. వారిపై ఉన్న గౌరవంతో పాటు భవిష్యత్తులో వారు మరింత బాధ్యతగా పనిచేసేలా ప్రోత్సహిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.