3 May, 2026 | 2:36 AM

డ్రైవర్లు, కండక్టర్లను వేధించొద్దు!

03-05-2026 01:18 AM
  1. ఆప్యాయతతో పనులు చేయించుకోవాలి
  2. ఆర్టీసీ ఆర్‌ఎంలు, డీఎంలు, ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ 
  3. ప్రతి నెల రెండో మంగళవారం గ్రీవెన్స్ సమావేశం

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతోపాటు ఇతర సిబ్బందిని డిపో మేనేజర్లు, ఉన్నతాధికారులు వేధించొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సిబ్బందిపై అధికారులు వేధింపు ధోరణితో కాకుండా స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయాలన్నారు. సిబ్బంది సమస్య లను నేరుగా వినేందుకు ప్రతి నెల రెండో మంగళవారం అన్ని డిపోలలో ఫిర్యాదుల పరిష్కార సమావేశాలను (గ్రీవెన్స్ మీటింగ్స్) తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.

శనివారం ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, మే 17వ తేదీలోగా అన్ని డిపోలు, బస్ స్టేషన్లలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచాలని డిపో మేనేజర్లను మంత్రి ఆదేశించారు.

మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పచ్చదనం, పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. టికెటింగ్ విషయంలో తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, సిబ్బందితో వాగ్వాదాలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సిబ్బంది వేధింపులపై సీఎం సీరియస్ అవడంతోనే మంత్రి పొన్నం అధికారులతో ఈ సమావేశం నిర్వహించినట్లుగా తెలిసింది.

జూన్ నెలాఖరులోగా పెండింగ్ అంశాల పరిష్కారం: ఎండీ వై.నాగిరెడ్డి

టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ.. జూన్ నెలాఖరులోగా బస్టాండుల లోని కమర్షియల్ షాపులకు సంబంధించిన పెండింగ్ అంశాలను, ఇతర పరిపాలనాపరమైన సమస్యలను పరిష్కరించాలని అధికారు లను ఆదేశించారు. భవిష్యత్తులో సంస్థను మరింత లాభదాయకంగా, సేవా దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సిహెచ్. వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సాలోమన్, ఎఫ్‌ఏ విజయపుష్ప, సిటీఎం శ్రీదేవితో పాటు వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, రీజి నల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.