సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మొద్దు
అసత్య ప్రచారం చేసిన వన్నూరు స్వామి అరెస్టు: ఆర్జీఐఏ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్
శంషాబాద్, జూలై 28, (విజయక్రాంతి): సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను గుడ్డిగా నమ్మొద్దని శంషాబాద్ ఆర్జీఐఏ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ క్యాటరింగ్ వ్యాపారం చేసే వన్నూరు స్వామి కస్టమర్లు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని కోపంతో కస్టమర్లను అసభ్యకరమైన మాటలతో తిడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న వన్నూరు స్వామి అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు చెన్నూరు స్వామి మహిళల ఫోటోలు వారి ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాల్ గర్ల్ అంటూ అసత్య ప్రచారం చేశాడు. దీంతో బాధిత మహిళలు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో నిందితుడు డబ్బు లావాదేవీల విషయంలో విభేదాల కారణంగా ఇలా బెదిరింపులకు, వేధింపులకు పాల్పడినట్లు తేలింది. నిందితుడిపై సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో కేసులు ఉన్నట్లు ఏసిపి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
నిందితుని ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అసభ్య పోస్టులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఐటీ చట్టం, మహిళల వేధింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళలు ఇలాంటి నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇలాంటి వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే 100 లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.






