18 April, 2026 | 6:59 PM

గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్న జిల్లా సహకార అధికారి

18-04-2026 05:56 PM

- కలెక్టర్ సారూ... డిసిఓ పై చర్యలు తీసుకోండి

- మాకు ఉపాధి కల్పించే మా ఇసుక ర్యాంపు మాకు కావాలి

- శ్రీరామ మహిళా ఇసుక సొసైటీ కమిటీ సభ్యులు

చర్ల,(విజయక్రాంతి): మండలంలోని గిరిజనులకు వర ప్రధాయినిగా మారిన డీసెల్టింగ్ ఇసుక ర్యాంపులకు సంబంధించి గిరిజన గ్రామాలలో గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్న జిల్లా సహకార అధికారిపై చర్యలు తీసుకోవాలని శ్రీరామ మహిళా ఇసుక సొసైటీ కమిటీ సభ్యులు కలెక్టర్ ను డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని కలివేరు గ్రామంలో శ్రీరామ మహిళా ఇసుక సొసైటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించి, తమ ఆవేదనను వెళ్ళగక్కారు. రాష్ట్ర ప్రభుత్వం మండల పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో గల గోదావరి నదిలో ఇసుక పూడికతీత పనుల కోసం గిరిజన మహిళా సొసైటీలను ఏర్పాటుచేసి పూడికతీత పనులను నిర్వహిస్తున్న సంగతి విధితమే.

దానిలో భాగంగా జిల్లా సహకార అధికారి ఆదేశాలకు కలివేరు గ్రామంలో గల 300 మంది గిరిజన మహిళలు సొసైటీగా ఏర్పడి సభ్యత్వాలకు సంబంధించి డబ్బులు చెల్లించిన అనంతరం ఆ అధికారి అదే గ్రామంలో మరొక కమిటీని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో గ్రామంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.దీనితో శ్రీరామ ఇసుక మహిళ సొసైటీ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గతంలో జిల్లా సహకార అధికారి తమ గ్రామంలో ఇసుక మహిళా సొసైటీని ఏర్పాటు చేసుకోమని తెలపడంతో సొసైటీని ఏర్పాటు చేసుకున్నామని, తీరా ఇప్పుడు మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు అనుచరులు వేరొక సొసైటీని 17 మందితో ఏర్పాటుచేసి తమ జీవనోపాధి కి ఆటంకం కల్పిస్తున్నారని, దీని అంతటికి జిల్లా సహకార అధికారి కారణమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ నాయకురాలు  సరేం రమాదేవి, పాయల శ్రీదేవి, పూనెం నాగమణి, పసుపులేటి గౌతం, శ్యామల హైమావతి, సోడి రమణ, పూణెం గంగమ్మ, దుర్గం శాంతమ్మ,తదితరులు పాల్గొన్నారు