16 July, 2026 | 11:32 PM

‘సహ’.. అందరికీ నచ్చే ఎమోషనల్ డ్రామా

16-07-2026 11:08 PM

ప్రేమ, జ్ఞాపకాలు, జీవిత పోరాటం వంటి భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సహ’. ‘లైఫ్ ఆఫ్ సంజు’ అనేది ట్యాగ్‌లైన్. నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివకుమార్ కాసారం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా కథానాయికలు. మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘనా సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ది సోల్ ఆఫ్ సహ’ గ్లింప్స్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది. తాజాగా చిత్రబృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ తొలిగీతం ‘కాలాన్నే తిరగేసి..’ని విడుదల చేసింది. ఈ పాటను ‘ఎమోషన్ ఆఫ్ సహ’గా పరిచయం చేశారు టీమ్. తన జీవితంలోని ప్రేమను కోల్పోయిన కథానాయకుడు, మళ్లీ ఆమెను కలుసుకోవాలని కలలు కంటూ అనుభవించే ఆవేదన, ఆశలను ఈ పాట అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మరోసారి తన మెలోడీ మ్యాజిక్‌ను చూపించారు. పూర్ణాచారి రాసిన సాహిత్యం భావోద్వేగాలకు కవిత్వ రూపం ఇవ్వగా, అనురాగ్ కులకర్ణి తనదైన గాత్రంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. నాయకానాయికలు శివకుమార్ కాసారం, శ్వేత లక్ష్మణ్ మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి కరుణాకర్ కే సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దినేశ్ పెద్ది ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు విడుదలైన తొలిపాట కథలో సంగీతానికి ఎంత ప్రాధాన్యం ఉందో తెలియజేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఈ సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలు ఈ సినిమాతో సెటిల్ అయితే చాలని నిర్మాత తేజ్ చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. నిర్మాత పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడు. ఒక సందర్భంలో శివకుమార్‌తో మాట్లాడుతుంటే నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. తన జీవితం నిలబడాలనే ఆశతో ఈ సినిమా చేశాడు. ఇది చాలా మంచి ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా” అన్నారు. 

దర్శకుడు నిశాంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలను ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకుంటారు. మేము ఒక మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు కూడా ఇదొక మంచి సినిమా అని చెబుతారనే నమ్మకం ఉంది” అని తెలిపారు. ‘ఈ చిత్రం మా అందరికీ మంచి భవిష్యత్తునిస్తుందని నమ్ముతున్నాన’ని హీరో శివకుమార్ చెప్పారు. చిత్ర సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర, గీత రచయిత పూర్ణాచారితోపాటు టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.