ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను ఆగస్టు 3 లోపు బీఎల్‌ఓలకు సమర్పించాలి
ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని ఓటర్లందరూ తమ ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను ఆగస్టు 3వ తేదీ లోపు సంబంధిత (బీఎల్‌ఓ) బూత్ లెవల్ అధికారులకు సమర్పించి, తమ ఓటు హక్కును కాపాడుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా యాదగిరి సునీల్ రావు తన ఎన్యుమరేషన్ ఫారాన్ని పూరించి అధికారులకు సమర్పించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తుచేశారు. మనల్ని పాలించే పరిపాలన అందించే సరైన నాయకులను ఎన్నుకోవడానికి ఓటు అనేది ప్రతి పౌరుడికి ఒక ఆయుధం లాంటిదని.. ఒకవేళ మనం ఓటు హక్కును కాపాడుకోలేకపోతే, పాలకులను ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.






