అందరికీ దగ్గరయ్యే సినిమా.. ‘రాజా ది రాజా’
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన ‘రాజా ది రాజా’ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కే నిహారిక దాసరి నిర్మించారు. ఇందులో సాయికుమార్, నరేశ్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, భద్రం, మైమ్ మధు, ఆనంద్ ముఖ్యపాత్రల్లో నటించారు.
జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరో రుత్విక్ మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి స్కూల్లో, కాలేజీలో ఎక్కడికి వెళ్లినా అందరినీ ఎంటర్‌టైన్ చేయాలని అనుకునేవాడిని. ఇప్పుడు ఆ కల ‘రాజా ది రాజా’ ద్వారా నెరవేరుతోంది” అన్నారు.
‘తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారు. మాది కూడా అలాంటి మంచి సినిమా. ఈ సినిమాను అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాన’ని హీరోయిన్ విశాఖ ధిమాన్ తెలిపింది.
దర్శకుడు అనిల్ బోయిడపు మాట్లాడుతూ.. “నేను ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నానో, ‘రాజా ది రాజా’ అలాంటి సినిమానే. ఇది అందరికీ దగ్గరయ్యే సినిమా. సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయి” అని చెప్పారు.
నిర్మాత కే నిహారిక దాసరి మాట్లాడుతూ.. “ప్రీమియర్ చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. రుత్విక్ చిన్నప్పటి నుంచే హీరో కావాలనే కలతో ఎంతో శ్రమించి, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. నిజంగా ఇప్పుడు తన పేరు ‘రుత్విక్ రాజా’ అని పెట్టాలనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా ఇదే ప్రేమతో సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అన్నారు.
సంగీత దర్శకుడు మార్క్ కే రాబిన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా నా జీవితంలో ఒక అందమైన ప్రయాణం. ఈ సినిమాకు టైటిల్ ఐడియా ఇచ్చింది నేనే. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. మేము ఎంతో నిజాయితీతో ఈ సినిమాను చేశాం” అని తెలిపారు. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.






