12 June, 2026 | 2:29 AM

రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేని సీఎం

12-06-2026 01:04 AM
  1. ఉచిత విద్యుత్ ఎత్తేసే కుట్ర
  2. టీఆర్‌ఎస్ చీఫ్ కవిత

నల్లగొండ టౌన్, జూన్ 11 (విజయక్రాం తి): రైతు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని టీఆర్‌ఎస్ అధినేత్రి కవిత ఆరోపిం చారు. గురువారం నల్గొండ పట్టణ కేంద్రంలో రైతు సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం వ్యవసాయశాఖపై ఒక్క సమీక్ష కూడా చేయకపోవ డమే ఇందుకు నిదర్శనమన్నారు. రైతుభరోసా, రైతురుణమాఫీ ఎగ్గొట్టి అన్నదాతలను అరిగోస పెడుతున్నారని ఆరోపించారు. 

నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు కొంటున్నాడని పరోక్షంగా మంత్రి కోమటిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించా రు. నల్గొండ అంటేనే మేధావులకు, విప్లవాల కు అడ్డా అన్నారు. రైతు సమస్యలపై పోరాటం చేస్తే గానీ ప్రభుత్వంలో చలనం రాదన్నారు. ఉచిత విద్య, వైద్యం, రైతుకు గౌరవం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయం పాంచజ న్యం అనే ఐదు అంశాలనే తమ పార్టీ ప్రాధాన్యంగా పెట్టుకుందని చెప్పారు.

ప్రభుత్వం వెంటనే రైతుభరోసా వేయాలని, ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. మనది చిన్నపార్టీ అయినా పిడికెడు మందితో ప్రారంభమైనా చరిత్రను తిరగరాద్దామని కవిత రైతులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరందించాలని, దిండి ప్రాజెక్టు కారణంగా మహబూబ్‌నగర్-నల్గొం డ మధ్య గొడవ పరిస్థితులున్నాయన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పి వా టిని లాక్కుంటున్నారని కవిత ఆరోపించారు.