శిథిలమైన మార్కెట్ భవనం
కేసముద్రం, ఆగస్టు 13 (విజయక్రాంతి): కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ నిర్వహణ కోసం నిర్మించి అద్దెకు ఇచ్చిన భవనం శిథిలావస్థకు చేరింది. భవనం పైకప్పు దెబ్బ తినడంతో వర్షానికి కురుస్తుండడం వల్ల అప్పట్లో బ్యాంకు నిర్వాహన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ క్రమంలో ఎస్బిహెచ్, ఎస్బిఐ బ్యాంకులో విలీనం కావడంతో మార్కెట్ ఆవరణలో నిర్వహించిన ఎస్బిహెచ్ శాఖను అద్దె భవనంలోని ఎస్బిఐ లోకి మార్చారు.
దీనితో గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంటుంది. శిధిలమైన భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి బ్యాంకుకు లేదంటే ఇతర వాణిజ్య సంస్థలకు అద్దెకు ఇస్తే మార్కెట్కు ఆదాయం సమకూరేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవనం పరిస్థితిని అంచనా వేయడానికి గతంలో పాలకమండలి ఎన్ ఐ టి కి నివేదిక ఇవ్వాలని కోరింది. అయితే ఆ తర్వాత పాలకమండలి మార్పు జరగడంతో శిథిలమైన పాత ఎస్బిహెచ్ బ్యాంకు పరిస్థితిని పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేసముద్రం మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించడంతో అదనంగా, కొత్తగా వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల కార్యాలయాలకు మెరుగైన వసతికి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో పాత ఎస్బిహెచ్ బ్యాంకు కోసం మార్కెట్ నిర్మించి ఇచ్చిన భవనాన్ని తొలగించి కొత్తది నిర్మిస్తే మార్కెట్ కు అదనపు ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఎస్బిహెచ్, ఎస్బిఐ రెండు విలీనం చేసి ఒక ప్రైవేటు భవనంలో నిర్వహిస్తుండగా, ఖాతాదారుల సంఖ్యకు అనుగుణంగా బ్యాంకు వసతి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం శిధిలమైన భవనాన్ని పూర్తిగా తొలగించి కొత్తది నిర్మించి ఇస్తే అటు ఎస్బిఐ బ్యాంకుకు మెరుగైన వసతి లభించడంతోపాటు, రైతులకు, వాణిజ్య వేత్తలకు, ఇతర ఖాతాదారులకు ఎంతో అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయంపై స్పందించి శిథిలమైన భవనాన్ని వెంటనే తొలగించి కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
ఎన్‌ఐటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది
మార్కెట్ ఆధ్వర్యంలో నిర్మించిన భవనం శిథిలంగా మారింది. ఈ విషయాన్ని ధ్రువీకరించి ఇవ్వడానికి ఎన్‌ఐటి నివేదిక కావాలి. ఎన్‌ఐటి సర్వే కోసం మార్కెట్ నుండి ప్రతిపాదనలు పంపించాం. సర్వే కోసం మూడు లక్షల పదివేల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. ఉన్నతాధికారుల నుంచి అప్రూవల్ రాగానే, ఎన్‌ఐటి కి సర్వే కోసం నగదు ట్రాన్స్ఫర్ చేసి, సర్వే చేయించి, ఎన్‌ఐటి ఇచ్చే నివేదిక ఆధారంగా భవన నిర్మాణం పై చర్యలు తీసుకుంటాం.
- రాజేంద్రప్రసాద్, గ్రేడ్ 3 కార్యదర్శి,
కేసముద్రం మార్కెట్






