23-02-2026 01:49:16 AM
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
ఆపరేషన్ కగార్ కీలక పరిణామం
నంబాల ఎన్‌కౌంటర్ అనంతరం పార్టీకి దేవ్ జీ సారథ్యం
ముగుస్తున్న నాలుగు దశాబ్దాల సాయుధ పోరాట అధ్యాయం
విస్తుపోయే నిజాలు వెల్లడయ్యే ఛాన్స్
ఉద్యమంలో ఉన్నది ఇక కొంతమందే..
హైదరాబాద్,సిటీ బ్యూరో/చర్ల/కోరు ట్ల/ఆసిఫాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్ కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్, పార్టీ సెక్రె టరీ జనరల్ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి సరెండర్ అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) ముందు లొంగిపోయినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
మార్చి 31నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్, రాజిరెడ్డి టార్గెట్‌గా ఇటీవల ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ తాజాగా లొంగిపోయినట్టు తెలుస్తోంది. గత మే నెలలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్‌కౌం టర్ తర్వాత దేవ్‌జీ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు.
కోరుట్ల నుంచి కేంద్ర కమిటీ దాకా..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మావోయిస్టు పార్టీలో సామాన్యమైన వ్యక్తి కాదు. చిన్ననాటి నుంచి చదువులో రాణించిన ఆయన, ఇంటర్మీడియట్ వరకు కోరుట్లలోనే చదువుకున్నారు. అనంతరం కరీం నగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో రాడికల్ స్టూడెం ట్ యూనియన్, పీడీఎస్‌యూ భావజాలానికి ఆకర్షితుడై 1984లో అజ్ఞాతం లోకి వెళ్లారు.
దంతెవాడలో 2010 లో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల హత్యకు తిరుపతే ప్రధాన సూత్రధారి. 1993 ప్రాంతంలో దండకారణ్యం స్పెషల్ జోన ల్ కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు. మావోయిస్టు పార్టీలో నక్సలైట్లు విలీనం అయిన తర్వాత దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిన తొలి దళానికి తిరుపతి కమాండర్‌గా పనిచేసినట్లు చెబుతున్నారు.
సుమారు నాలుగు దశాబ్దాల పాటు దేవ్ జీ అడవిలోనే ఉంటూ గెరిల్లా విభాగాలను నడిపించిన ప్రధాన వ్యూహకర్తగా పేరుపొందారు. నంబాల కేశవరావు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టి, కేంద్ర కమిటీ సెక్రటరీగా దేశవ్యాప్తంగా పార్టీ వ్యూహాలను ఆయనే రచించేవారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో దేవుజీ అంటే పోలీసు బలగాలకు ఒక పెద్ద సవాల్‌గా ఉండేవారు.
అటువంటి అగ్రనేత నేడు అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా దళాలు అడవుల్లో మావోయిస్టుల సరఫరా మార్గాలను పూర్తిగా దిగ్బంధించాయి. ఆధునిక డ్రోన్ల నిఘా, కఠినమైన గాలింపు చర్యలతో హిడ్మా వంటి భీకర నేతలు ఇప్పటికే ఎన్‌కౌంటర్లలో మరణించగా, మరో అగ్రనేత గణపతి విదేశాల్లో తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భద్రతా దళాల తీవ్ర ఒత్తిడి, అడవుల్లో తిరగలేనంతగా బాధిస్తున్న అనారోగ్య సమస్యలు, కొత్త క్యాడర్ భర్తీలో ఘోర వైఫల్యం, మార్చి 31 లోపు నక్సలిజాన్ని అంతం చేస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలతో అగ్రనేతలు లొంగుబాటుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా ఆసిఫాబాద్‌లోని సిర్పూర్ యు అడవుల్లో గ్రే హ్యాండ్స్ దళాలు జరిపిన మెరుపు దాడుల వల్ల దేవ్‌జీ బృందానికి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు గాలింపు చర్యలు, మరోవైపు ఆహారం అందక పోవడంతో చివరకు పోలీసులకు చిక్కినట్లు సమాచారం.
మల్లా రాజిరెడ్డి అంచెలంచెలుగా ఎదిగి
లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ స్వస్థలం పెద్దపల్లి శాస్త్రులపల్లి. ఒడిశా దండకారణ్యంలో కీలకంగా వుండేవాడు. మావో యిస్టు పార్టీకి ఆకర్షితుడై, తొలుత ఆర్‌ఎస్‌యూలో పనిచేశాడు. క్రమంగా పార్టీ విస్తర ణలో పనిచేస్తూ, మంథని, మహాదేవ్ పూర్ ఏరియా దళంలో పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీలో సభ్యుడయ్యాడు.
1996,97 ప్రాంతంలో పార్టీ ఆయన్ను కేంద్ర కమిటీలోకి తీసుకొంది. 1986లో పూర్వ ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పై దాడి జరిపి ఒక ఎస్‌ఐ, 12 మంది పోలీసులను కాల్చి చంపిన కేసులో నిందితునిగా ఉన్నారు. ఖమ్మం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై మెరుపుదాడి జరిపి 16 మంది పోలీసులను హతమార్చారు.
ముగుస్తున్న సాయుధ పోరాటం..
నాలుగు దశాబ్దాల పాటు సాగిన తుపాకీ పోరాటం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. వరుస ఎన్‌కౌంటర్లలో కీలక నేతలను కోల్పోవడం, మిగిలిన వారు వద్ధాప్యం అనారోగ్యంతో సతమతమవడం వల్ల పార్టీ ని బలోపేతం చేయడం అసాధ్యమని దేవ్ జీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వంటి ఒకరిద్ద రు నేతలు తప్ప, దాదాపు అగ్రనేతృత్వం అంతా తలవంచినట్లేనని పోలీసు లు భావిస్తున్నారు. దేవ్ జీ లొంగిపోయారన్న వార్త తో జగిత్యాల జిల్లాలోని ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలతో తిరిగి రావడం వారికి ఎంతో ఊరటనిస్తోంది.
రెండు రోజుల్లో మీడియా ముందుకు
లొంగిపోయిన 16 మంది మావోయిస్టులను ప్రభుత్వం నుండి అందే ఆర్థికసహా యం, ఉపాధి రక్షణ వంటి అన్ని రకాల పునరావాస పథకాలకు అర్హులుగా గుర్తించను న్నారు. వీరిని రెండు రోజుల తర్వాత హైదరాబాద్‌లో మీడియా ముందు ప్రవేశపెట్ట ను న్నారు. ఈ సందర్భంగా అగ్రనేతల వద్ద నుంచి సేకరించిన మావోయిస్టుల రహస్య స్థావరాలు, దాచిన ఆయుధ నిల్వలు ఇతర సాంకేతిక సమాచారాన్ని పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.
ఈ లొంగుబాటుతో అడవిలో మిగిలి ఉన్న మిగతా తక్కువ స్థాయి క్యాడర్ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.