9 April, 2026 | 1:13 PM

శ్రీరంగాపూర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

09-04-2026 11:25 AM

పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మెఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ సురభి

శ్రీరంగాపూర్: మండల కేంద్రంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రజలకు ఉపయోగపడే కీలక నిర్మాణాలను ప్రారంభించి, మరికొన్ని అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.

ఈ భవనం ద్వారా మండల ప్రజలకు రెవెన్యూ, ధృవపత్రాలు, భూ సమస్యల పరిష్కారం వంటి పరిపాలనా సేవలు మరింత సౌకర్యవంతంగా అందనున్నాయని అధికారులు తెలిపారు.అదేవిధంగా రూ.5 లక్షలతో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇల్లును కూడా ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం చేపడుతున్న గృహ పథకాల అమలులో ఈ మోడల్ ఇల్లు ఆదర్శంగా నిలుస్తుందని, అర్హులైన పేదలకు గృహ కల సాకారం కావడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.ఇక రూ.88.55 లక్షల వ్యయంతో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ గదులు పూర్తయితే మెరుగైన విద్యా వాతావరణం, తరగతి గదుల కొరత నివారణ, సౌకర్యవంతమైన బోధన సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ శ్రీహరి రాజు, మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, సర్పంచ్ మద్దిలేటి, స్థానిక ఎమ్మార్వో వరలక్ష్మి, ఎంపీడీవో రవి నారాయణ, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు