10 June, 2026 | 5:11 PM

బోధన్‌ పట్టణంలో ఘనంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

10-06-2026 04:45 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్‌ పట్టణంలో ఘనంగా ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ వార్డు సభ బుధవారం రోజున బోధన్ పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం  కళ్యాణ మండపంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 31వ వార్డు నుండి 38 వ వార్డుల సంయుక్త వార్డు సభను  నిర్వహించారు. ఈ కార్యక్రమములో అడిషనల్ కలెక్టర్  భుజంగరావు, మునిసిపల్ చైర్ పర్సన్  పద్మ, మునిసిపల్ కమీషనర్ జాదవ్ కృష్ణ, బోధన్ టౌన్ ఎస్ఐ హబీబ్ ఖాన్, మునిసిపల్ మేనేజర్ రమేష్,బోధన్ మండల ఆర్ఐ శ్రీనివాస్, నాగేశ్వర్ రావు, మెప్మా పట్టణ సమన్వయకర్త శ్రీనివాస్ హాజరయ్యారు. 

అడిషనల్ కలెక్టర్  మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాలతో వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరు భాద్యతగా  ఇళ్లలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ ఆటోలకే అందించాలని, ఇంటి ముందున్న డ్రైనేజీలలో చెత్త వేయకూడదని స్పష్టం చేశారు. ప్లాస్టిక్, పాలితీన్ క్యారీ బ్యాగులను  వాడవద్దని సూచించారు. వర్షాకాలం మురుగునీరు మోరీలలో నిలుస్తే,దోమలు తయారయ్యి మలేరియా, డెంగీ, కలరా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దోమల నివారణకు మోరీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు.  ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ  ప్రక్రియ గురించి వివరించారు.

ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ల జాబితాతో మ్యాప్ చేసుకోవాలని, దీని ఉద్దేశ్యం అర్హత ఉన్నవారు ఓటరుగా ఉండాలి, అర్హతలేని వారు అనగా చనిపోయినవారు, డూప్లికేట్, పర్మనెంట్ మైగ్రేషన్ అయినవారిని తొలగించి పారదర్శకతో కూడిన ఓటర్ల జాబితా తయారు చేయడం అని తెలిపినారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం, ఇన్సూరెన్స్ స్కీంలు అమలుచేస్తుంది. ప్రజలు ఆలస్యం చేయకుండా సరియైన సమయంలో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నుండి లబ్ధిపొందాలని తెలిపినారు.

టౌన్ ఎస్ఐ మాట్లాడుతూ.. సమాజానికి శాపంగా మారిన గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను కనిపెట్టుకుని ఉండాలన్నారు. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు  చెప్పకూడదని తెలిపినారు. ఈ మధ్య కాలంలో 'డిజిటల్ అరెస్ట్' పేరుతో వస్తున్న దొంగ కాల్స్ నమ్మి మోసపోవద్దన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని కోరారు.

మునిసిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ వార్డు సభల్లో వచ్చిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం జరిగింది.  వర్షాకాలం సీజన్ కాబట్టి ప్రజల ఆరోగ్యం ముఖ్యం, పట్టణములోని ప్రజలందరికి మునిసిపల్ నుండి కల్పించవలసిన అన్ని రకాల సౌకర్యాలు వీధుల శుభ్రత, డ్రైనేజి క్లీనింగ్, మంచినీటి సరఫరా, స్ట్రీట్ లైట్ల నిర్వహణ చేస్తున్నామని, ప్రజలు సహకారం అందించి చెత్తను మొరిల్లో వేయవద్దని, మునిసిపల్ చెత్త ఆటోలుకే అందించాలని తద్వారా బోధన్ పట్టణమును చెత్త రహిత పట్టణముగా తీర్చిదిద్దాలని కోరారు.