6 March, 2026 | 6:02 AM

పశ్చిమాసియాలో.. ధ్వంసకాండ

06-03-2026 02:20 AM

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ- 6

ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్

గల్ఫ్‌లోని యూఎస్ ట్యాంకర్, కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్, ఒమన్ పోర్ట్‌పై క్షిపణుల దాడి

ఒమన్ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి

అజర్‌బైజాన్‌పై ముమ్మరంగా దాడులు

హోర్ముజ్ జలసంధిలోకి -భారత్, చైనా నౌకలను అనుమతిస్తామని ప్రకటన

వివిధ నౌకల్లో చిక్కుకున్న 23 వేల మంది భారత సిబ్బంది

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముప్పేట దాడి

ఇరాన్ పాలన, సైనిక స్థావరాలను కూల్చడమే లక్ష్యమని వెల్లడి

టెహ్రాన్ ఎయిర్‌పోర్టులోని డిటెక్షన్ సిస్టమ్స్,ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం

గత ఆరు రోజుల దాడుల్లో ఇరాన్‌లో 1,230 మంది మృతి

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ప్రతీకారంతో ఇరాన్ పొరుగు దేశాల నౌకాశ్రయాలు లక్ష్యంగా క్షిపణి దాడులు ముమ్మరం చేసింది. అజర్‌బైజాన్‌పై విరుచుకుపడింది. విమానాశ్రయం, ఓ స్కూల్‌పై ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఒమన్ గల్ఫ్‌లోని ‘స్కైలైట్’ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ జరిపిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్..

క్షిపణులతో టెహ్రాన్‌పై పెద్దఎత్తున దాడి చేశా యి. పేలుళ్లతో ఆ నగరం దద్దరిల్లింది. హెజుబుల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్, లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తున్నది. ఆయుధాలు విడనాడాలని లెబనాన్ ప్రభుత్వం చేసిన సూచనను హెజుబుల్లా సంస్థ తిరస్కరించింది.  ఇలాఉండగా, అమెరికా తన అణు క్షిపణి డూమ్స్‌డేను పరిక్షించింది.

ఇరాన్‌పై ఐదు వేల బాంబులు

మరో రెండు వారాల పాటు దాడులు చేస్తాం

ఇరాన్ పాలన, సైనిక స్థావరాలను కూల్చడమే మా లక్ష్యమని వెల్లడించిన ఇజ్రాయెల్

టెహ్రాన్ ఎయిర్‌పోర్టులోని డిటెక్షన్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం

ఆపరేషన్ టెహ్రాన్‌గా 1000 మందికి పైగా అమెరికన్ సిబ్బంది

గత ఆరు రోజుల దాడుల్లో ఇరాన్‌లో 1,230 మంది మృతి

టెహ్రాన్, మార్చి 5 : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఉధృతం అవుతున్నాయి. ట్రెహాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన తమ ఆపరేషన్ కనీసం మరో రెండు వారాల పాటు కొనసాగొచ్చని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. ఇరాన్ పాలన, దాని సైనిక స్థావరాలను కూల్చడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి బుధవారం వరకు తమ వైమానిక దళం ఇరాన్‌పై 5000కు పైగా బాంబులతో దాడులుచేసిందని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. తమ దాడుల్లో వేలాది మంది ఇరాన్ సైనికులు మృతి చెందారని పేర్కొంది. 

టెహ్రాన్‌లోని అతిపెద్ద మిలిటరీబేస్‌పై 250 బాంబులు

టెహ్రాన్‌లోని అతిపెద్ద మిలిటరీబేస్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం బుధవారం దాడిచేసింది. 100కు పైగా యుద్ధవిమానాలతో దాదాపు 250 బాంబులను పేల్చింది. ఈ మిలిటరీ ప్రాంగణంలోనే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) హెడ్‌క్వార్టర్స్, ఐఆర్‌జీసీ కుద్స్‌ఫోర్స్ హెడ్‌క్వార్టర్ వంటి కీలక ఆఫీసులు ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇవన్నీ చాలా వరకు ధ్వంసమైనట్లు సమాచారం. ఇక టెహ్రాన్ ఎయిర్‌పోర్టులోని డిటెక్షన్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. 

దాడుల ప్రాంతాలను పంచుకున్న అమెరికా, ఇజ్రాయెల్

ఇరాన్‌లో ఎక్కడెక్కడ ఎవరు దాడులు చేయాలన్న వివరాలను అమెరికాతో పంచుకున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని మిలిటరీ స్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లపై  ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేస్తోంది. అటు దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి లాంచర్లను అగ్రరాజ్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ స్థావరాలను టెహ్రాన్ టార్గెట్ చేస్తోంది. దీంతో ఈ ఆపరేషన్ కోసం దాదాపు 1000 మందికి పైగా అమెరికన్ సిబ్బంది ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్నారు. 

లెబనాన్‌పై భారీదాడులు

ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ రాజధాని అయిన బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలన్నింటినీ బలవంతంగా ఖాళీ చేయించాలని ఆదేశాల జారీతోపాటు అమెరికా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల దాడి చేస్తూనే ఉన్నాయి. లెబనాన్ అంతటా దాడులను అమెరికా వైమానిక దళాలు ఉధృతం చేశాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ప్రకారం, మొదటి దాడి తర్వాత అనేక అదనపు క్షిపణులను ప్రయోగించాయి. ఒకేసారి ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ నుంచి ఒక క్షిపణి, లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థానాల నుంచి ఆరు క్షిపణులను ప్రయోగించారని ఐడీఎఫ్ తెలిపింది.

కొద్దిసేపటి తర్వాత, ఇరాన్, హిజ్బుల్లా రెండోసారి ఒకే టైమ్‌లో దాడులను ప్రారంభించాయని పేర్కొంది. దాడులను మరింత తీవ్రతరం చేస్తూ, హిజ్బుల్లాతో కొనసాగుతున్న సరిహద్దు పోరాటం మధ్య తన దళాలు దక్షిణ లెబనాన్‌లోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇజ్రాయెల్, యూఎస్ దళాలు ఈ ప్రాంతం అంతటా ఇరాన్, హిజ్బుల్లాతో సంబంధం ఉన్న లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తున్నందున సమన్వయంతో కూడిన దాడులు జరిగాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 72 మంది మరణించారని ఆ దేశ సామాజిక వ్యవహారాల మంత్రి హనీన్ సయీద్ తెలిపారు.

నాటో సైనిక కూటమిలో సభ్యుడైన టర్కీ వైపు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన తర్వాత ఇరాన్‌కు ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నాటో వైమానిక రక్షణ వ్యవస్థలు క్షిపణిని టర్కిష్ గగనతలంలోకి ప్రవేశించే ముందు అడ్డగించాయని టర్కిష్ అధికారులు తెలిపారు. ‘మా భూభాగాన్ని, గగనతలాన్ని రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.

ఏవైనా శత్రు చర్యలకు ప్రతిస్పందించే హక్కు మాకు ఉంది’ అని టర్కిష్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షిపణి సంఘటన తర్వాత, టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ తన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చితో కలిసి అధికారికంగా నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇరాన్‌లో ఇప్పటివరకు జరిగిన ఈ దాడుల్లో (ఆరు రోజుల్లో) కనీసం 1,230 మంది మరణించినట్లు సమాచారం.

భారీ పేలుళ్లతో ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు దద్దరిల్లింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ) నేవీ స్థావరంపై దాడి జరిగినట్లు మీడియాలో కథనాలు  వస్తున్నాయి. ఈ పేలుళ్లు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధికి సమీపంలో జరిగాయి. పేలుళ్ల వల్ల జరిగిన నష్టం ఇంకా తెలియలేదు. 

ఇరాన్ సుప్రీం ఎంపికలో నేను పాల్గొనాలి : ట్రంప్

ముదురుతున్న దాడులు, సంక్షోభం వేళ ఇరాన్ తదుపరి సుప్రీం నాయకుడిని ఎంచుకోవడంలో తాను తప్పక పాల్గొనాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆక్సియోస్‌తో మాట్లాడుతూ, ఇరాన్ తదుపరి సుప్రీం నాయకుడిని ఎంచుకోవడంలో తాను వ్యక్తిగతంగా పాల్గొనాల్సిన అవసరం ఉందని నమ్ముతున్నానని, వెనిజులాలో తన మునుపటి ప్రమేయానికి ఇది సమాంతరంగా ఉందని స్పష్టం చేశారు.

ఎనిమిది నిమిషాల ఫోన్ కాల్లో, హత్యకు గురైన సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీ వారసుడు అని ట్రంప్ అంగీకరించారు, కానీ ఆ ఫలితం తనకు ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ‘వారు తమ సమయాన్ని వృథా చేస్తున్నారు. ఖమేనీ కుమారుడు తేలికైనవాడు. వెనిజులాలో డెల్సీ లాగా నేను నియామకంలో పాల్గొనాలి’ అని ట్రంప్ తెలిపారు.