28 May, 2026 | 2:45 AM

గురుకుల పాఠశాలల్లో ప్రతి సీటు భర్తీ కావాలి

28-05-2026 01:53 AM

నిర్లక్ష్యానికి తావులేదు

సీట్లు భర్తీ కాని పాఠశాలలపై ప్రత్యేక అధ్యయనం చేసి సమస్యలు పరిష్కరించాలి

ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కు జిల్లా అధికారిని ఇంచార్జిగా నియమించాలి

గురుకుల, సంక్షేమ వసతి, విద్యాసంస్థలపై సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం, మే 27 (విజయక్రాంతి): రాబోయే విద్యా సంవత్సరానికి గురుకులాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టీ విక్రమార్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్., అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సంబంధిత అధికారులతో కలిసి గురుకుల, సంక్షేమ వసతి విద్యాసంస్థలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీట్లు పూర్తిగా భర్తీ కాని రెసిడెన్షియల్ పాఠశాలలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి కారణాలు గుర్తించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని వసతి విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని తెలిపారు. వేసవి కాలంలోనే అవసరమైన మరమ్మతులు, మౌళిక వసతుల పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో డైట్ ఛార్జీలు, మెనూ వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపారు. ప్రతి గురుకుల  విద్యాసంస్థకు ఒక జిల్లా అధికారిని ఇన్చార్జిగా నియమించి, వారు ప్రతి నెల పాఠశాలలను సందర్శించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

జిల్లా అధికారులు రెగ్యులర్గా పాఠశాలలను సందర్శించి తనిఖీ నివేదికలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. వైద్యులు కూడా ప్రతి నెల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన మరమ్మతులు నిరంతరం చేపట్టాలని సూచించారు. 

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాల పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఎన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయో, యంగ్ ఇండియా పాఠశాలలు పూర్తయ్యాక ఎన్ని తరలించవచ్చో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం లు విద్యార్థులకు సకాలంలో అందించడాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. 

సిబ్బంది జీతాలు, డైట్ ఛార్జీలు, అద్దెల చెల్లింపులు ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నదని తెలిపారు. మరమ్మతుల నిధులు కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో పనులు క్షేత్రస్థాయిలో  వేగంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పనుల బిల్లులు అధికంగా క్లియర్ చేసినట్లు తెలిపారు.

విద్యాశాఖ పనుల బిల్లుల చెల్లింపులకు డీఎంఎఫ్టీ నిధులను కూడా వినియోగిస్తామని చెప్పారు. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందుతున్న నేపథ్యంలో స్వంత భవనాల్లో నడుస్తున్న గురుకులాల్లో సోలార్ ప్యానెల్ల ఏర్పాటు కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎస్‌ఈ, ఎన్పిడిసిఎల్ శ్రీనివాస్, విద్యా శాఖ సంబంధిత అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.