‘హట్టి’, సింగరేణి దోస్తీ!
బంగారం మైనింగ్ భవిష్యత్తు ప్రాజెక్టుల్లో జతకట్టాలి
జాయింట్ వెంచర్ కోసం పరిశీలన చేయాలి
సింగరేణి అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం
హట్టి, యూటీ బంగారు గనుల్లో విస్తృత పర్యటన
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): బంగారం మైనింగ్‌లో విశేష అనుభవమున్న కర్ణాటక ప్రభుత్వ సంస్థ హట్టి గోల్డ్ మైన్స్‌లో సింగరేణి కలిసి పనిచేసేలా జాయింట్ వెంచర్ అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రెండు ప్రభుత్వ రంగ సంస్థల సాంకేతిక సామర్థ్యం, అనుభవాన్ని సమన్వయం చేస్తే దేశీయ బంగారం ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
కర్ణాటక గోల్డ్ మైన్స్ ప్రాంతంలో రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం రాయచూర్ జిల్లాలోని హట్టి, యూటీ బంగారు గనులను డిప్యూటీ సీఎం సందర్శించారు. బంగారు ఖనిజం తవ్వకం నుంచి శుద్ధ బంగారం తయారీ వరకు చేపడుతున్న ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించారు. హట్టి గోల్డ్ మైన్స్‌కు బంగారం అన్వేషణ, తవ్వకం, ప్రాసెసింగ్, శుద్ధిలో అపార అనుభవం ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. బొగ్గు, ఇతర ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో సింగరేణికి ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని హట్టిఅనుభవంతో జోడించాలన్నారు.
బంగారం అన్వేషణ, తవ్వకం, వెలికితీత, శుద్ధి, ఆధునిక సాంకేతి కత వినియోగం, నిపుణుల సేవలు, మానవ వనరుల శిక్షణ తదితర అంశాల్లో రెండు సంస్థలు సంయుక్తంగా పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. దేశ ఆర్థిక భద్రతలో బంగారం కీలక పాత్ర పోషిస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
దేశంలో అందుబాటులో ఉన్న బంగారు ఖనిజ వనరులను శాస్త్రీయంగా అన్వేషించి వెలికితీయడంలో సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుండాలన్నారు. బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంద న్నారు. హట్టిసింగరేణి భాగస్వామ్యంతో బంగారం ఉత్పత్తి పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, స్థానిక ఉపాధి కల్పనతోపాటు దేశ ఆర్థికాభివృద్ధికి మేలు జరుగుతుందని తెలిపారు.
ఉత్పత్తి నుంచి శుద్ధి వరకు పరిశీలన
హట్టి గోల్డ్ మైన్స్‌లోని ప్రొడక్షన్ యూనిట్, ఖనిజ శుద్ధి కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. గని నుంచి వెలికితీసిన ఖనిజాన్ని వివిధ దశల్లో ప్రాసెస్ చేసి, శుద్ధ బంగారంగా మార్చే విధానాన్ని అధికారులు వివరించారు. హట్టి ప్రాజెక్టు ద్వారా రోజుకు సగటున రెండు నుంచి నాలుగు కిలోల బంగారం ఉత్పత్తి అవుతోందని అధికారులు తెలిపారు. ‘యూటీ ఓపెన్ కాస్ట్ గోల్ ్డ మైన్’ వ్యూ పాయింట్ వద్ద నిలబడి బంగారం ముడి మట్టిని వెలికి తీసిన ప్రక్రియను, సేకరించిన ప్రదేశాలను ఆయన ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ గనిలో ఎంత లోతు నుంచి బంగారం తయారీకి కావలసిన ముడి సరుకును తీశారనే వివరాలను అక్క డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బంగారం ఖనిజ గనికి సంబంధించిన సమగ్ర మ్యాప్‌లను పరిశీలించారు. అక్కడి అధికారులు డిప్యూటీ సీఎంతో మొక్కను నాటించారు. అనంతరం యుటీ భూగర్భ గనిలో జరుగుతున్న తవ్వకాలు, రవాణా, యంత్రాల వినియోగం, కార్మికుల భద్రత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ప్లానింగ్ అండ్ ప్రాజెకట్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ పంకజ్ కులశ్రేష్ఠ, రాయచూరు జిల్లా పరిషత్ సభ్యులు అమ్జద్, హట్టి గోల్ మైన్స్ ఉన్నతాధికారులు అరుణవ ఘోష్, సఫీయుల్లా ఖాన్, విధాత్రి ఉపుండ, యెమ్నూరప్పగౌడ రిటైర్డ్ కల్నల్ దస్తగిరి సాహెబ్ దఫేదార్ పాల్గొన్నారు.






