రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని ప్రధాన రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సుల్తానాబాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్, సుల్తానాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. రంజిత్ రావు ల ఆధ్వర్యంలో మంగళవారం వినూత్నంగా 3డి రేడియం పోలీస్ ఇన్నోవా వాహనాల నమూనాలను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే సుగ్లాంపల్లి–నారాయణపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఒకటి, కాట్నపల్లి రైస్ మిల్ సమీపంలో మరొకటి ఏర్పాటు చేశారు. ఈ 3 డి రేడియం పోలీస్ వాహనాలను దూరం నుంచే గమనించిన వాహనదారులు అక్కడ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారనే భావనతో వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ప్రయాణిస్తారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో రేడియం ప్రతిఫలనం వల్ల ఇవి స్పష్టంగా కనిపించడం వలన వాహనదారులు మరింత జాగ్రత్తగా వాహనాలు నడుపుతారు .ఈ చర్యతో అతివేగం తగ్గి, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని స్థానిక ప్రజలుఅభిప్రాయపడుతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి స్థానికప్రజలు,వాహనదారులు, వ్యాపారులు విశేషంగా స్పందిస్తూ సుల్తానాబాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్ ని, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. రంజిత్ రావు ని అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అతివేగం వద్దు – ప్రాణం ముద్దు అనే సందేశాన్ని గుర్తుంచుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని సూచించారు. ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం – సురక్షిత ప్రయాణమే లక్ష్యం అని వారు అన్నారు.






