9 June, 2026 | 3:52 AM

‘శీనన్న వచ్చాకే దశాబ్దాల అభివృద్ధి సాధ్యమైంది’

09-06-2026 12:24 AM
  1. పొన్నేకల్కు దక్కిన ప్రాధాన్యతను గుర్తించే కాంగ్రెస్లోకి వెళ్తున్నాం
  2. ఇందిరమ్మ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్ణయాలే మమ్మల్ని కదిలించాయి
  3. వివిధ పార్టీల నుంచి తరలివచ్చి.. స్వచ్ఛందంగా చేరిన వారి స్పష్టీకరణ
  4. తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్న 50 కుటుంబాలు

ఖమ్మం, జూన్ 8(విజయక్రాంతి) : దశాబ్దాలుగా మా ప్రాంతంలో జరగని అభివృద్ధి.. మంత్రి పొంగులేటి శీనన్న వచ్చిన తర్వాతే కళ్లముందు సాక్షాత్కరిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులకు ప్రాధాన్యత ఇవ్వడం, మా పొన్నేకల్ గ్రామంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ’యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ నిర్మిస్తుండటమే ఇందుకు నిదర్శనం. మా గ్రామానికి, మా ప్రాంతానికి మంత్రి పొంగులేటి ఇస్తున్న ఈ ప్రత్యేక ప్రాధాన్యతను గుర్తించే మేమంతా కాంగ్రెస్ బాట పట్టామని పార్టీలో చేరిన పలువురు నేతలు పేర్కొన్నారు. సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయం వేదికగా ఖమ్మం రూరల్ మండలంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.

బీఆర్‌ఎస్, సీపీఎం సహా వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 కుటుంబాల వారు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమానికి, పొంగులేటి అభివృద్ధి మంత్రానికి ఆకర్షితులై పార్టీలో చేరారు. క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి వీరందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

పొన్నేకల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ చేరికల ప్రక్రియ విజయవంతంగా సాగింది. కాంగ్రెస్ గూటికి చేరిన వారిలో రాయల సైదులు, మారపొంగు నరేష్, సిరిపల్లి లక్ష్మయ్య, గార్లపాటి ఉపేందర్, వరగాని ఉపేందర్ కుటుంబాలతో పాటు సుమారు 50 కుటుంబాల వారు ఉన్నారు. దశాబ్దాల వెనుకబాటుకు పొంగులేటి చొరవతోనే మోక్షం లభిస్తుందని నమ్మి, తమ గ్రామాభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం, కళ్ళెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లారెడ్డి, మద్ది వీరారెడ్డి, ముత్యం చిన్ని కృష్ణారావు, ఖమ్మం రూరల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటి రమణ పాల్గొన్నారు.