1 June, 2026 | 1:43 PM

World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో

01-06-2026 12:16 PM

జైనూర్,(విజయక్రాంతి): జైనూర్ మండలంలో సుమారు 200 మంది చిన్న, సన్నకారు రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. అందరూ ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రపంచ పాల దినోత్సవం(World Milk Day) రోజే జైనూర్ మండల డైరీ రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాల కొనుగోలు ధరలు తగ్గిపోగా, దాణా, గడ్డి, మందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మండలంలోని జామిని గ్రామానికి చెందిన డైరీ రైతు సతీష్ ముండే గత కొన్ని ఏళ్లుగా పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 10 ఆవులు ఉన్నాయి. రోజుకు సుమారు 45 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నారు.

గతంలో లీటర్ పాలకు రూ. 40 వచ్చేవి. ఇప్పుడు రూ. 27కి పడిపోయింది. కానీ దాణా బస్తా రూ. 1800 నుంచి రూ. 2000కి పెరిగింది. గడ్డి బస్తా గతంలో రూ. 300 ఉండేది, ఇప్పుడు రూ. 550కి పెరిగింది. కరెంట్ బిల్లులు, కూలీల చార్జీలు కూడా పెరిగిపోయాయి. దీంతో పెట్టుబడి ఎక్కువై రాబడి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు.  రోజు కూలీలు పోను నెలకు చేతికి ఏమీ మిగలడం లేదు అని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో డైరీ నిర్వహణ గగనంగా మారిందని, చాలా మంది రైతులు పశువులను అమ్మేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు.

కలెక్టర్ దృష్టి పెట్టాలి: సతీష్ ముండే

డైరీ రైతులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. పాల ఉత్పత్తిదారులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, దాణా, మందులపై సబ్సిడీ ఇవ్వాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు. "ప్రభుత్వం రాయితీలు, ఆర్థిక సహాయం అందిస్తేనే ఈ పరిశ్రమ బతుకుతుంది. లేకుంటే రైతులు రోడ్డున పడే పరిస్థితి" అని డైరీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే చాలా మంది రైతులు పశువుల మేత ఖర్చు తట్టుకోలేక వాటిని అమ్మేస్తున్నారు. దీంతో మండలంలో పాల ఉత్పత్తి కూడా తగ్గే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.