19-02-2026 01:23:30 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : దేశంలోని పది రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. దేశ వ్యాప్తంగా 37 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం ఏప్రిల్ 9న పూర్తికానుండగా.. ఆయా స్థానాలకు ఎన్ని కలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ రానుంది.
మార్చి 5వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ, 6న పరిశీలన స్క్రూటినీ, మార్చి 9వ తేదీ వరకు నామినేషన్ల విత్ డ్రా జరగనున్నాయి. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ్య ఎన్నికలు ముగియనున్నాయి.
ఏప్రిల్ 9వ తేదీతో తెలంగాణ ఎంపీలైన కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ పదవీకాలం పూర్తికానుంది. ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి, అభిషేక్ మను సింఘ్వీ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అభిషేక్ సింఘ్వీకే మళ్లీ ?
౩౭ స్థానాల్లో ఏడు మహారాష్ట్ర, ఒడిశాలో మూడు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఆరేసి స్థానాలు, అస్సాంలో మూడు, బిహార్‌లో నాలుగు, ఛత్తీస్‌ఘఢ్‌లో రెండు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లలో ఒక్కొక్క స్థానానికి, తెలంగాణలో రెండుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణ నుంచి ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ సీట్లు.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబ లాన్ని బట్టి ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది.
ఒక సీటు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీకే మళ్లీ రెన్యువల్ చేసే అవకాశం ఉంది. సింఘ్వీ సేవలు అటు పార్టీకి, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అవసరమని, అందుకు ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయనున్నారు. ఇక మిగతా ఒక సీటు కోసం తెలంగాణ నుంచి అరడజన్‌కు పైగా నాయకులు పోటీ పడుతున్నారు.