19 March, 2026 | 8:09 AM

సీఎస్ పదవీకాలం మళ్లీ పొడిగింపు

19-03-2026 02:03 AM

డీవోపీటీ నిర్ణయం

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి కే రామకృష్ణారావు పదవీకాలం పొడిగింపుపై ఉత్కంఠకు తెరప డింది. ఆయన పదవీ కాలాన్ని మరో  మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ పరిధిలోని పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీవోపీటీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.

గతేడాది ఆగస్టు 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఆయన సర్వీసును పొడిగించాలని డీవోపీటీని ప్రభుత్వం కోరింది. దీంతో 7 నెలలు ఆయన సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమా లను అమలుచేయడంలో రామకృష్ణారావు విజయం సాధించారు.

యంత్రాగాన్ని గాడిలో పెట్టడం, తోటి సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయడం, గత ప్రభుత్వ రుణాలను షెడ్యూల్ చేయించడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, మార్చి 31తో ఆయన పదవీకాలం ముగియనుండటంతో ఆ గడువును పొడగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీకి లేఖ రాయగా సానుకూల స్పందన వచ్చింది. దీంతో మరో 3 నెలల పాటు రామకృష్ణా రావు సీఎస్ పదవిలో ఉండనున్నారు.