27 July, 2026 | 7:20 PM

డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి

27-07-2026 06:13 PM

బూర్గంపాడు,(విజయ క్రాంతి): బూర్గంపాడు మండలం టేకులచెరువు గ్రామానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను వెంటనే కేటాయించి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ సీపీఎం నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టేకులచెరువు గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు ఇళ్లను అందించకపోవడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్, హౌసింగ్ అధికారులకు నెల రోజుల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి సంబంధిత 40 కుటుంబాలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.కలెక్టర్ హామీపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో ఇళ్లను అందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.