30 July, 2026 | 1:43 AM

రక్షక భటులా.. భక్షకులా?

30-07-2026 12:48 AM

జూబ్లీహిల్స్ సీఐ కీచక పర్వం..

వేరు వేరు ఇష్యూలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సీపీ సజ్జనార్ సస్పెన్షన్ వేటు

జూబ్లీహిల్స్ సీఐపై లైంగిక దాడి, బ్లాక్మెయిలింగ్ ఆరోపణలు

బాధితురాలి సంచలన ఆడియో లీక్..

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మలక్‌పేట సీఐ కూడా సస్పెండ్

రంగారెడ్డి/జూబ్లిహిల్స్, జులై 29 (విజయక్రాంతి): న్యాయం కాపాడాల్సిన రక్షణ కవచమే భక్షకంగా మారితే? అభయం ఇవ్వాల్సిన ఖాకీ చొక్కాయే కాటేసే కొండచిలువలా మారితే? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా వెలుగుచూసిన నీచ పర్వం నగర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సమస్య పరిష్కారం కోసం తలుపు తట్టిన ఓ అభాగ్యురాలిపై సానుభూతి పేరిట వల విసిరి, లైంగిక దాడికి ఒడిగట్టడమే కాకుండా.. రహస్య వీడియోలతో బ్లాక్మెయిలింగ్కు తెగబడ్డాడు జూబ్లీహిల్స్ సీఐ యు. శ్రీనివాసులు రెడ్డి. బాధితురాలు విడుదల చేసిన సంచలన ఆడియో లీక్తో ఈ కీచక పర్వం బట్టబయలైంది.

మరోవైపు విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన మలక్పేట్ సీఐ నరసింహపై కూడా క్రమశిక్షణా చర్యలు పడ్డాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తీసుకున్న సంచలన నిర్ణయం నగర పోలీస్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

నమ్మించి మోసం.. రహస్య వీడియోలతో బ్లాక్మెయిల్....

బాధితురాలు అందించిన ఫిర్యాదు ప్రకారం.. తనకున్న ఒక సమస్యపై ఫిర్యాదు చేసేందుకు ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఆ సమయంలో సీఐ శ్రీనివాసులు రెడ్డి ఆమెకు సానుభూతి నటిస్తూ దగ్గరయ్యారు. న్యాయం చేస్తానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

అంతేకాకుండా, ఏకాంతంగా ఉన్న సమయాల్లో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ బాధితురాలి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఈ వేధింపుల కారణంగా తాను బలవంతంగా గర్భస్రావం (అబార్షన్) కూడా చేయించుకోవాల్సి వచ్చిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐతో తాను మాట్లాడిన సంభాషణకు సంబంధించిన సంచలన ఆడియో రికార్డింగ్ను బాధితురాలు ఉన్నతాధికారులకు అందజేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఎదురు బ్లాక్మెయిలింగ్ అంటున్న సీఐ

మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను సీఐ శ్రీనివాసులు రెడ్డి తీవ్రంగా ఖండించారు. సదరు మహిళే పదే పదే తనను బెదిరిస్తూ డబ్బుల కోసం ఎదురు బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతోందని సీనియర్ అధికారుల ఎదుట తన వాదన వినిపించారు. ఈ కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించడంతో పాటు, జూబ్లీహిల్స్ సీఐగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడంతో సీపీ సజ్జనార్ ఆయనను సస్పెండ్ చేశారు.

విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించం: సీపీ సజ్జనార్

మరో ఘటనలో, అధికారిక విధుల్లో తీవ్ర అలసత్వం, బాధ్యతారాహిత్యం ప్రదర్శించిన మలక్పేట్ ఇన్స్పెక్టర్ నరసింహపై శాఖాపరమైన విచారణ అనంతరం సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజల భద్రతలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. రక్షక భటులుగా ప్రజల్లో నమ్మకం పెంపొందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. విధుల్లో అక్రమాలకు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు‘ అని హెచ్చరించారు.