శాతవాహన వీసీ ఉమేష్ కుమార్‌కు సన్మానం
ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ జేఏసీ నాయకులు సన్మానించారు. అమెరికా పర్యటనలో శాతవాహన యూనివర్సిటీ విద్యా, పరిశోధన, అభివృద్ధి అంశాలను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేయడంతో పాటు, యూనివర్సిటీకి మూడు బంగారు పతకాలు తీసుకురావడం అభినందనీయం అని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.
ఈ ఘనత శాతవాహన యూనివర్సిటితో పాటు విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు ఎంతో గర్వకారణమని తెలిపారు. జేఏసీ చైర్మన్ చెన్నమల చైతన్య మాట్లాడుతూ, శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి కోసం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ చేస్తున్న కృషి ఎనలేనిది అని అన్నారు. అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసి యూనివర్సిటీకి మూడు బంగారు పతకాలు తీసుకురావడం ఆయన నాయకత్వానికి, కృషికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో శాతవాహన యూనివర్సిటీ మరింత ఉన్నత స్థాయికి ఎదిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.






