17 July, 2026 | 1:06 AM

కాంగ్రెస్ వైఎస్‌ఆర్ హయాంలో ప్రాజెక్టుల అవినీతి

17-07-2026 12:54 AM

కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల ప్రగతి

సీతారామ ప్రాజెక్టును సాకారం చేసిన దార్శనికుడు కేసీఆర్

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం, జులై 16 (విజయక్రాంతి): ఆనాడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవినీతి, దోపిడీకి గురై కునారిల్లిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుగా పునర్జీవం పోసి ప్రగతి పథంలో నడిపించారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ఆర్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని జలయజ్ఞం అని ధనయజ్ఞంగా మార్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట దోపిడీ చేసి ప్రాజెక్టులను అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మార్చిందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి గోదావరి జలాలను ఒడిసిపట్టి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టిందని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.9 వేల కోట్లు వెచ్చించి, 100 కిలోమీటర్లకు పైగా ప్రధాన కాలువలు, పంప్ హౌస్లు, పైప్లైన్లు, ట్రాన్స్మిషన్ వ్యవస్థలను నిర్మించామని, అధిక సామర్థ్యం గల మోటార్లు, ఆధునిక యాంత్రిక పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు పనుల్లో గణనీయమైన పురోగతి సాధించామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు వంటి క్లిష్టమైన అంశాలను పరిష్కరించి, ప్రాజెక్టు నిర్మాణాన్ని 90 శాతం వరకు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగానికి సాగర్ ఆయకట్టుకు శాశ్వత సాగునీటి భరోసా కల్పించడం, వ్యవసాయాభివృద్ధి, భూగర్భ జలాల పెంపు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును రూపుదిద్దారని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు సీతారామ ప్రాజెక్టుకు తాము ఎంత మేర నిధులు ఖర్చు చేశారో చేసిన కృషి ఏమీ లేక ప్రజలకు చెప్పుకునే విషయాలు లేకపోవడంతో కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులనే తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ మంత్రులు చేయడం ప్రజలను మోసం చేయడమేనని ఎవరి కృషి ఏమిటో వాస్తవాలు ప్రజలకు స్పష్టంగా తెలుసని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.