సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు భద్రాద్రి జిల్లా రైతులకే ఇవ్వాలి
పోలీసు అరెస్టులను ఖండించిన కన్వీనర్ దొడ్డి తాతారావు
చర్ల, జులై 16 (విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకే కేటాయించాలని బిఆర్‌ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు గురువారం డిమాండ్ చేశారు. చర్ల మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖమ్మం జిల్లా మంత్రులు సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను ఖమ్మం జిల్లాకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆరోపించారు. అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్న నలుగురు మంత్రులను అడ్డుకునేందుకు బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో మణుగూరుకు బయలుదేరిన బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేసి అడ్డుకున్నారని తీవ్రంగా ఖండించారు.
శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కును హరించడం సరికాదు. ప్రజల గొంతును పోలీసుల ద్వారా అణచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. ప్రజలకు నష్టం చేసే ఏ కార్యక్రమాన్ని అయినా ప్రజల పక్షాన నిలబడి ప్రతిఘటిస్తాం‘ అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల అవసరాలకు మాత్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఎస్ డి అజీజ్, తడికల బుల్లి అబ్బాయి, కారం కన్నారావు, కాకి అనిల్, తదితరులు పాల్గొన్నారు






