17 July, 2026 | 1:03 AM

బీఆర్‌ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

17-07-2026 01:02 AM

బూర్గంపాడు, జూలై16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని సీతారామ సాగర్ పంప్ హౌస్ ను సందర్శించేందుకు వస్తున్న రాష్ట్ర మంత్రుల పర్యటనను నిరసిస్తూ అశ్వాపురం బయలుదేరిన బీఆర్‌ఎస్ నాయకులను బూర్గంపాడు పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు అశ్వాపురానికి బయలుదేరిన బీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అడ్డుకొని అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.అరెస్ట్ అయిన వారిలో బిఆర్‌ఎస్ మండల యూత్ అధ్యక్షుడు గోనెల నాని, నాయకులు కొనకంచి శ్రీను,పూర్ణ, కనకా చారి, గుల్ మహమ్మద్, శ్రీను, చైతన్య రెడ్డి, సతీష్, ఈశ్వర్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రాజెక్టు పరిశీలనకు ఉప ముఖ్యమంత్రి సహా ముగ్గురు మంత్రులు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో రైతుల తరఫున ప్రశ్నించాలని పార్టీ పిలుపునిచ్చిన వేళ, ముందస్తుగా బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

కోట్లాది రూపాయలు వెచ్చించినప్పటికీ సీతారామ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో భద్రాద్రి జిల్లా రైతులు సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా రైతులకు సాగునీరు అందించడం సంతోషకరమైన విషయమేనని, అయితే అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులను నిర్లక్ష్యం చేయడం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు జిల్లా వ్యాప్తంగా చివరి ఎకరం వరకు చేరేలా చర్యలు తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.