వంట గ్యాస్ మంట!
భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు
గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 60 బాదుడు
వాణిజ్య బండపైనా రూ.115 వడ్డింపు
పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో గృహ సిలిండర్ రూ.965, వాణిజ్య సిలిండర్ రూ.2,076.5
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావమే కారణం
హైదరాబాద్, మార్చి 7 : పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్‌పై పడింది. దీంతో వంటగ్యాస్ ధరలు భారీ గా పెరిగాయి. గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు, తద్వారా ఉత్పన్నమైన అంతర్జాతీయ మార్కెట్ అనిశ్చితి, ఇంధన సరఫరాలో మార్పులు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, సుమారు ఏడాది కాలంగా స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరగడం గృహిణులతో పాటు చిన్న తరహా వ్యాపారులపై అదనపు భారాన్ని మోపనుంది.
పదకొండు నెలల తర్వాత..
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌తో పాటు 19 కిలోల వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ ధర సైతం ఏకంగా రూ. 115 మేర పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రభా వం చూపే కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1883, ముంబైలో రూ. 1835, కోల్‌కతాలో రూ. 1990, చెన్నైలో రూ. 2043.50 కి చేరుకుంది. హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,076.5గా ఉంది. 2025 ఏప్రిల్ తర్వా త ధరల్లో మార్పు రావడం ఇదే తొలిసారి.
గత నెల వరకు కేవలం కమ ర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే పెరుగుతూ వచ్చాయి. ఇది సామాన్యుడిపై పరోక్షంగా ప్రభావితం చేసేది. కానీ, ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్ ధరలు కూడా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుతాయో తెలియని నేపథ్యంలో ముందు ముందు ఇంకెంత ‘బండ’ బాదుడు ఎదుర్కోవాలో అని సామాన్యుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తింది. కాగా ఉజ్వల్ పథకం ద్వారా అందిచే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.
ఇంధన ధరలు పెంచబోం: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ
పశ్చిమాసియాలో హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు పునరుద్ధరించిన నేపథ్యంలో ఇంధన ధరలు పెంచబోమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. దేశంలో ఇంధన సరఫరాపై వస్తున్న వార్తలపై కేంద్ర శాఖ మంత్రి స్పందించారు. దేశంలో ఇంధన కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.
‘మా ప్రాధాన్యత ఎప్పుడూ పౌరులకు సరసమైన, స్థిరమైన ఇంధనాన్ని అందించడమే. ప్రస్తుతం దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి’ అని ఆయన ’ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. అదేవిధంగా, పెట్రోల్- డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొట్టిపారేసింది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు
ప్రధాన నగరాల్లో కొత్త ధరలు (14.2 కేజీల సిలిండర్)
ఢిల్లీ: 853 నుంచి రూ. 913కి చేరింది.
ముంబై: రూ. 852.50 నుంచి రూ. 912.50 కి పెరిగింది.
కోల్‌కతా: రూ. 879 నుంచి రూ. 939 కి చేరింది.
చెన్నై: రూ. 868.50 నుంచి రూ. 928.50 కి పెరిగింది.
హైదరాబాద్ : రూ. 905 నుంచి రూ. 965 కి పెరిగింది.
ప్రధాన నగరాల్లో కమర్షియల్(19కేజీలు) సిలిండర్ ధరలు ఇలా..
ఢిల్లీ: రూ.1883
ముంబై: రూ. 1835
కోల్‌కతా: రూ. 1990
చెన్నైలో : రూ. 2043.50
హైదరాబాద్: రూ.2,076.5




