దాత ఇంటి ముందు ఫ్రీజర్ బాక్స్ దింపు కలకలం
గరిడేపల్లి, ఏప్రిల్ 5 : మండలంలోని వెలిదండ గ్రామంలో ఫ్రీజర్ బాక్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు గడ్డం లక్ష్మీ నరసయ్య జ్ఞాపకార్థంగా 2022లో గ్రామానికి అందించిన ఫ్రీజర్ బాక్స్ను,మాజీ సర్పంచ్ ఆధురి పద్మ కోటయ్య 2024 మార్చి వరకు నిర్వహించారు.
అనంతరం దాతల అభ్యర్థనపై బాధ్యతలు వారికి అప్పగించారు.ఇటీవల కొత్త సర్పంచ్,కార్యదర్శి తిరిగి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని దాత గడ్డం అనిల్ కుమార్ను సంప్రదించగా,ఆయన సమ్మతి తెలిపారు.అయితే అకస్మాత్తుగా గ్రామపంచాయతీ సిబ్బంది ఫ్రీజర్ బాక్స్ను దాత ఇంటి వద్ద దింపి వెళ్లడం వివాదానికి దారితీసింది.పాలకవర్గం తీర్మానం మేరకు ఈ చర్య తీసుకున్నట్లు సిబ్బంది తెలిపగా,దాత అనిల్ కుమార్ మాత్రం రాజకీయ దురుద్దేశంతో తన సేవను కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది.




