సర్ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర
కలిసికట్టుగా ఎదుర్కొందాం
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర సమీక్ష (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో తెలంగాణలో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని, దీన్ని అన్ని పార్టీలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని, మన రాష్ట్రంలో ఆ విధంగా జరగనివ్వబోమని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ హౌజ్‌లో హజ్ యాత్రికుల బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు ఉద్యోగాలు, సంక్షేమ పథకాల విషయంలో మైనారిటీలకు దక్కాల్సిన వాటాను వారికి అందిస్తున్నామని చెప్పారు. విదేశీ విద్య విషయంలోనూ మైనారిటీలకు ఉపకారవేతనాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
వైట్ కాలర్ ఉద్యోగాల కంటే ప్రస్తుతం బ్లూ కాలర్ జాబ్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందని, అమెరికా కంటే జర్మనీ, జపాన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసి యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో చాలామంది మైనారిటీ సోదరులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ ఆటోగా మార్చాలని నిర్ణయించామని, దీంతో ఆటో డ్రైవర్లకు డబ్బులు ఆదా అవుతాయని సీఎం వివరించారు.
ఇరాన్, ఇరాక్ యుద్ధంతో విమాన ఇంధన ధరలు పెరిగాయని, దీంతో విమాన ఛార్జీలు పెరిగాయని తెలిపారు. హజ్ యాత్రికులపై చార్జీల భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మాకు హిందూ, ముస్లిం భేదాభిప్రాయం లేదని, హిందూ ముస్లిం భాయీ భాయీ అని పేర్కొన్నారు.
గత ఏడాది హజ్ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందారని, ప్రతీ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పు, పరిహారం ఇచ్చి ఆదుకున్నట్లు సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ముస్లిం మైనార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.






