భక్తి శ్రద్ధలతో పోచమ్మకు మొక్కులు
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆషాఢ మాసం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జనకాపూర్ కోదండరామాలయం కాలనీ వాసులు ఆదివారం సామూహికంగా పోచమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలను సిద్ధం చేసి, అలంకరించిన బోనాలను తలపై ఎత్తుకుని డప్పు దరువులు, మేళతాళాల నడుమ శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రలో మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని భక్తి పారవశ్యాన్ని చాటగా, యువకులు డప్పు దరువులతో ఉత్సవానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.
డప్పు చప్పుళ్ల నడుమ పలువురు భక్తులు పూనకాలతో నృత్యాలు చేయగా, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం తమ కుటుంబాల సంప్రదాయమని భక్తులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో పంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద వృద్ధి చెందాలని, గ్రామాలు, పట్టణాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.






