నేరెళ్ల ఘటన బాధితులకు న్యాయం చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్
12-07-2026 04:24 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగల రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ టోనీ నేరెళ్ల ఘటనపై స్పందించారు. అనారోగ్యంతో మృతి చెందిన నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్‌కు నివాళులర్పించిన ఆయన, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేరెళ్ల ఘటనలో జరిగిన పోలీసు థర్డ్ డిగ్రీ, బాధితులు ఎదుర్కొన్న ఇబ్బందులకు కేటీఆర్ రాజకీయంగా, నైతికంగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధితులకు ప్రకటించిన ఆర్థిక సాయం సరిపోదని, వారికి సమగ్ర న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేరెళ్ల బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.






