రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాలు పెంచాలి
గద్వాల టౌన్, మే 8 : సామాజిక సేవా కార్యక్రమాలకు పేరుగాంచిన రెడ్ క్రాస్ సంఘం లో సభ్యత్వాలు పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు సర్ హెన్రీ డ్యూనాంట్ జయంతి సందర్భంగా శుక్రవారం ‘ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవమును పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో గద్వాలలోని రెడ్ క్రాస్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ లో కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హెన్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదుకై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో సిబ్బందిని నియమించి సభ్యత్వ నమోదు చేయడం జరుగుతుందన్నారు. రోజుకు 100 మంది చొప్పున జిల్లాలో కనీసం1500 సభ్యత్వాలు చేయాలని సూచించారు.
రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులుగా చేరేందుకు రూ.1000 రుసుము మాత్రమే ఉండడంతో ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డే కేర్ సెంటర్ లో వయోవృద్ధులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, నిర్వాహకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంఘం జిల్లా చైర్మన్ అయ్యపు రెడ్డి, వైస్ చైర్మన్ తాహిర్, ఇతర సభ్యులు రమేష్, మోహన్ రావు, అక్బర్ బాషా, ధనలక్ష్మి, గంగాధర్ గౌడ్ మహేష్ నాయుడు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.






