మాతో కలవండి
- గుజరాత్‌కు ఇచ్చినన్ని నిధులు తెలంగాణకూ ఇస్తాం
- అలా ఇస్తే ఇప్పుడు సగమే వస్తాయి.. అవి మీకు సరిపోతాయా?
- గుజరాత్ కంటే రెట్టింపు నిధులిస్తాం..
ఉమ్మడి ఏపీలో రైల్వేకు వెయ్యి కోట్లిస్తే మేము ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు ఇచ్చాం
హెచ్‌ఐసీసీలో ప్రధాని మోదీ
రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
హాజరైన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ అభివృద్ధికి మీ సహకారం కావాలి: సీఎం
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘గుజరాత్‌కి ఆ రోజు ఎంత ఇచ్చారో ఇప్పుడు తెలంగాణకు అంత ఇస్తే మేము ఇవ్వాలనుకున్న దాని లో సగమే వస్తాయని, ఆ రోజు గుజరాత్‌కి చేసిన కేటాయింపులకు రెట్టింపు తెలంగాణకు ఇవ్వాలని తాను ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. సగం నిధులే ఇస్తే అవి మీకు సరిపోతాయా? మీరు ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నారో దాన్ని చేరుకోలేరని, అందుకే మీరు మాతో కలవండి అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి నవ్వుతూ సల హా ఇచ్చారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో ఎలా అయితే సహకారం అందించారో,
నిధులిచ్చారో అలా తెలంగాణకు కూడా ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోదీ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరడంపై ప్రధాని మోదీ ఈ విధంగా స్పందించారు. అభివృద్ధి కోసం తమతో కలిసి రావాలంటూ రేవంత్‌కు హితవు పలికారు. ఆదివారం హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో దాదాపు రూ.9,400 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మోదీ మాట్లాడు తూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని అన్నారు.
రాష్ట్రంలో రోడ్డు, రైలు కనెక్టివిటీని భారీగా పెంచామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మాటలను జాగ్రత్తగా వినాలన్నారు. రైల్వే బడ్జెట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.వెయ్యి కోట్లు కూడా వచ్చేవి కాదని, కానీ ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు కేటాయించామన్నారు. కేవలం రోడ్ల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు కేటాయించామని చెప్పారు. దీనివల్ల తెలంగాణకు ఎంతో లాభం చేకూరింద న్నారు. రాష్ట్రానికి 5 వందే భారత్, 6 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇచ్చామని, కాజీపేట జంక్షన్‌ను వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవడంలో తప్పులేదని, అందుకే తాము అన్ని రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నామని, రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదన్నారు.
సైబరాబాద్ అతిపెద్ద ఉపాధి కేంద్రం
దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని, అతి పెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని మోదీ అన్నారు. అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ పురుడు పోసుకుంటున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. సైబరాబాద్ అభివృద్ధికి కేంద్రం వేలాది కోట్లు కేటాయించిందని, అంతర్జాతీయ స్థాయిలో సైబరాద్‌కు గుర్తింపు ఉన్నదన్నారు. సైబర్‌టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఇప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులతో వేలాది ఉద్యోగాలు యువతకు వస్తాయని తెలిపారు. వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. దేశ టెక్స్‌టైల్ రంగంలో ఇది కీలకపాత్ర పోషించనుందని, దీంతో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. దీని ద్వారా తెలంగాణ కూడా లాభపడుతోందని మోదీ అన్నారు.
ఇంధన భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రపంచం ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొటోందని, ఆ ప్రభావం దేశంపై పడకుండా చూసుకున్నామన్నారు. ఇంధన భద్రతలో మల్కాపూర్ ప్రాజెక్టు కీలకమని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ యువత కొత్త కలలు కంటున్నారన్నారు. రైతులు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు.
పీఎంవోలో సింగల్ విండో టాస్క్‌ఫోర్స్ ఉండాలి..
భారీ ఆర్థిక వృద్ధి, మహా నగరాలు, విశ్వ నగరాల నుంచే వస్తుందని, మనకు ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ ఆరు మహా నగరాలున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మన దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ మహా నగరాలను అభివృద్ధి చేయాలన్నారు. ఈ ఆరు మెట్రో నగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత గల అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు త్వరగా లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఉండాలని సీఎం కోరారు. ‘నా రాష్ట్రం, నా ప్రజల కోసం సానుకూల నిర్ణయాల విషయంలో నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను.
మా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు మీ అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. మూసీ నది, మెట్రో రైలు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ వరకు 12 వరుసల రహదారికి సంబంధించి ఆమోదం కావాలి. రెండు గంటల పాటు మీరు సమ యం కేటాయించి వాటిని సమీక్షించాలి’ అని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. ‘కేంద్ర మంత్రు లు కిషన్‌రెడ్డి, సంజయ్ మిత్రులు.. మీకు పెద్ద మనస్సు ఉందని తెలంగాణ తెలుసు. నేడు వారు దాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు.
తెలంగాణ అభివృద్ధికి సం బంధించిన పెండింగ్ పనులు, ప్రతిపాదనలు అన్నింటినీ మీరు ఆమోదిస్తారని తెలం గాణ ప్రజలు ఆశిస్తున్నారు’ అని చెప్పారు. ‘దేశం విషయంలో మేము మీతో కలిసి ఉన్నామని, మీరు వికసిత్ భారత్ 2047పైన మాట్లాడి, భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై మాట్లాడినప్పుడు, మేం మా రాష్ట్ర కోణంలో తెలంగాణ రైజింగ్ 2047ను దానికి అనుసంధానం చేశాము’ అని వెల్లడించారు.
వివక్ష లేకుండా అభివృద్ధి చేస్తాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వమున్నా వివక్షలేకుండా అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గతంలో ప్రధాని రామగుండం ఫర్టిలైజర్ పరిశ్రమను ప్రారంభించడానికి, అదేవిధంగా రూ.13 వేల కోట్ల ఎన్‌టీపీసీ పవర్ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేదన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలున్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధే ఏకైక లక్ష్యంగా ముందుకుపోవాలన్నారు.
రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు మూడేళ్ల క్రితమే కేంద్రం అనుమతి ఇచ్చిందని, భూసేకరణ ప్రక్రియ ముగిసి, కేంద్ర కేబినెట్ ఆమోదం లభించగానే పనులు ప్రారంభమవుతాయన్నారు. 2014 వరకు తెలంగాణలో 2,400 కి.మీ.ల జాతీయ రహదారులు ఉండగా, గత 11 ఏళ్లలో అదనంగా 2,600 కి.మీ కొత్త హైవేలను కేంద్రం నిర్మించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూ.220 కోట్ల వ్యయంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు స్థాయిలో అత్యాధునిక సదుపాయాలతో ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేస్తున్నామన్నారు.
ఇటీవలే చేర్లపల్లి రైల్వే స్టేషన్ను కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. రాష్ట్రం లో సమ్మక్క- సెంట్రల్ యూనివర్సిటీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, ఎయిమ్స్ ఆసుపత్రి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆశయమైన 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశం గా మార్చడంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
తెలంగాణపై మోదీ ఆశీర్వాదం ఉండాలి: సీఎం రేవంత్
ప్రధాని మోదీ అశీర్వాదం, సహకారం ఉంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఐదు రాష్టాల ఎన్నికలు పూర్తయ్యాయని, ఇప్పు డు తాము రాజకీయాల గురించి మాట్లాడబోమని, అభివృద్ధి గురించే మాట్లాడుతామ న్నారు. ఇది అభివృద్ధి ఉత్సవమని, కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం కాదన్నారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధే మనకు అత్యధిక ప్రాధాన్యమని, ముందు భారత దేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అనేది స్పష్టం చేశారు.
ఆ స్ఫూర్తితోనే దేశ నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీ వికసిత్ భారత్ 2047ను ప్రకటించినప్పుడు, తాము భాగస్వాములయ్యామన్నారు. తెలంగాణ రైజిం గ్‌కు ప్రధాని సహకారం అందిస్తారనే విశ్వాసం తమకు ఉన్నదన్నారు. తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ‘మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారంతో మీరు గుజరాత్ మోడల్‌ను అభివృద్ధి చేశారు.
తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాటి మన్మోహన్ సింగ్ విధంగా, ఆయన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా’ అని కోరారు. 2034లో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామనే నమ్మకం ఉంది. 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామని ఆశిస్తున్నా. నాడు మన్మోహన్‌సింగ్ ఆశీస్సులు అందించినట్లే మీరు తెలంగాణ ప్రజలకు ఆశీస్సులు అందించాలి’ అని సీఎం కోరారు.






