సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ
కొత్తగూడెం, జూన్ 12 (విజయక్రాంతి): రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలపై వినియోగదారులు ప్రవక్తగా ఉండాలని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ అన్నారు. పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సైబర్ మోసాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సురక్షితమైన డిజిటల్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎస్బిఐ గత రెండు సంవత్సరాలుగా ఖాతాదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఎస్బిఐ ఆధ్వర్యంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని పేర్కొన్నారు.
ఏదైనా సైబర్ మోసం జరిగినట్లయితే మొదటి గంటలోనే 1930 సైబర్ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా, సైబర్ మోసాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. సైబర్ భద్రతపై సమాచార బ్యానర్లను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు.
పాల్గొన్నవారికి వివిధ రకాల ఆన్లైన్ మోసాలు, నివారణ చర్యలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బ్యాంకింగ్ పాస్వర్డ్లు, ఓటీపీలు, ఏటీఎం కార్డు వివరాలు, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు సలహా ఇచ్చారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు, లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది.
వినియోగదారులలో సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ అలవాట్లను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఇలాంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తుందని వారు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో కొత్తగూడెం ఐదు బ్రాంచ్ లకు చెందిన బ్రాంచ్ మేనేజర్లు, సారపాక బ్రాంచ్, టౌన్ సారపాక బ్రాంచ్, భద్రాచలం బ్రాంచ్, యూబీ రోడ్ బ్రాంచ్, ఐటీడీఏ పిఓ బ్రాంచ్, పాల్వంచ బ్రాంచ్, కిన్నెరసాని బ్రాంచ్, సిల్ బ్రాంచ్, స్థానిక శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.






