calender_icon.png 4 February, 2026 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది

04-02-2026 07:27:16 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): వార్డుల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 02వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జడల పూలమ్మ – మల్లయ్య, 09వ వార్డు అభ్యర్థి ఏర్పుల పరమేష్, 10వ వార్డు అభ్యర్థి సిలువేరు మౌనిక – శేఖర్ ల చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 02వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు సిసి రోడ్ల నిర్మాణ పనులు ఇప్పటికే చేపట్టామని పేర్కొన్నారు. తాను పేదల బాధలు తెలిసిన వ్యక్తినని, మొదటి దఫాలోనే 3500 ఇండ్లను మంజూరు చేసి ప్రతి గ్రామానికి అందించామని తెలిపారు. 2014–2018 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చిట్యాల పట్టణంలో 240 ఇండ్ల నిర్మాణం చేపట్టిన విషయంను గుర్తు చేశారు.

గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల పాలుజేశాయని విమర్శించిన ఆయన, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, బెల్లి సత్తయ్య, మారగోని ఆంజనేయులు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.