జీవన్‌రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు
- కాంగ్రెస్‌ను వీడుతున్న మాజీ మంత్రి
- 25న జగిత్యాలలో బహిరంగ సభ
- కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
జగిత్యాల, మార్చి 16 (విజయక్రాంతి): మాజీ మంత్రి, కాంగ్రెస్ సీని యర్ నేత టి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 25న జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో జీవన్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశముందని సమాచారం. ఈ విషయాన్ని జీవన్‌రెడ్డి తన అనుచరులతో పంచుకున్నట్టు తెలుస్తున్నది. జగిత్యాల జిల్లా కేంద్రంలో జీవన్‌రెడ్డి ఇంటి వద్ద కాంగ్రె స్ ఫ్లెక్సీలను కూడా ఆయన అనుచరు లు తొలగించారు.
జీవన్‌రెడ్డి అనుచరు లు ఇప్పటికే సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చడం, గులాబీ రంగు పోస్టర్లు పెడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఈ ఇద్దరికి పొసగడం లేదు. అంతేకాకుండా సంజయ్ కుమార్ చేరిక తర్వాత పార్టీ అధిష్ఠానం జీవన్‌రెడ్డిని కాదని ఎమ్మెల్యేకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా జీవన్‌రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లోనూ టిక్కెట్ల కేటాయింపులో సంజయ్ కుమార్ వర్గానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. చైర్‌పర్సన్ పదవి కూడా సంజయ్ కుమార్ వర్గానికి వెళ్లడం జీవన్‌రెడ్డిలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. పార్టీకి నాలుగు దశాబ్దాలుగా సేవలు అందించిన తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం అనుచరులను కలచివేసింది.
తన అసంతృప్తిని జీవన్‌రెడ్డి పలుమార్లు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా సరైన పరిష్కారం లభించకపోవడంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో హైదరాబాద్‌లో జీవన్‌రెడ్డి సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. తరువాత ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కూడా చర్చలు జరిగాయని తెలుస్తున్నది.




