8 June, 2026 | 2:56 AM

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

08-06-2026 01:47 AM

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు

గత పదేళ్లలో రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ దోచుకుంది

టీఆర్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అతిథులు 

హైదరాబాద్, జూన్ 7(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, ప్రజలు ఈ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. దీంతో రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.

అయితే కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి బీఆర్‌ఎస్ కంటే అనేక రెట్లు పెరిగిందని కపిలవాయి ఆరోపించారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ (టీఆర్‌ఎల్‌డీ) సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ కార్యాలయాన్ని అబిడ్స్ రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి, న్యాయవాది కాశీరెడ్డి పాండురంగారెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షులు కపిలవాయి దిలీప్‌కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గౌర బీరప్ప, ప్రధాన కార్యదర్శి గంట్యాల నరసింహారావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌శర్మ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కపిలవాయి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ అవినీతి, బంధుప్రీతి, కుటుంబ పాలనకు ప్రత్యామ్నాయంగా ప్రజలు సమర్థవంతమైన రాజకీయ శక్తిని కోరుకుంటున్నారని, బీసీల స్వరం తెలంగాణ ఆకాంక్షలకు నిజమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నిరుద్యోగ యువత కోసం రోజ్‌గార్ మేళాలు, స్కిల్ మేళాలు, లోన్ మేళాలు నిర్వహించి లక్ష మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు.

ఈ నెల 27న వరంగల్‌లో ‘లక్ష్యం కోసం లక్ష సైన్యం’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పదవీ విరమణ పొందిన సైనిక అధికారుల  ఆధ్వర్యంలో యువతకు శారీరక దృఢత్వం, దేశభక్తి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి సైనిక విలువలతో శిక్షణ అందజేయనున్నట్లు చెప్పారు. యువత పెద్ద సంఖ్యలో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.

కాగా అమీన్‌పూర్ గ్రామం పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా సర్వే నెంబర్లు 165, 171 నుంచి 177 వరకు అనేక అక్రమ లేఅవుట్లు ఉన్నాయని కపిలవాయి దిలీప్‌కుమార్, కాశిరెడ్డి పాండురంగారెడ్డిలు ఆరోపించారు. సర్వే నెంబర్లు 165, 166లకు సంబంధించి తాజా భూ సర్వే నిర్వహించి, అసలు హద్దులను నిర్థారించాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తుల అక్రమాలను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా సర్వే 166లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని, అక్రమ ఆక్రమణదారులకు గతంఓ మంజూరు చేసిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.