30 July, 2026 | 12:56 PM

రాజ్యసభ నుంచి ప్రతిపక్షం వాకౌట్

30-07-2026 12:00 PM

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం రాజ్యసభ(Rajya Sabha) నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ఢిల్లీలో పెల్లెట్ గన్స్ ప్రయోగంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. కేంద్రం అంగీకరించకపోవడంతో విపక్షాలు వాకౌట్ చేశాయి. విద్యార్థుల సమస్యలు, రామమందిర విరాళాలలో అక్రమాలపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో తీవ్ర నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.

ప్రతిపక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో జరిగిన ఈ నిరసన రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. దేశ యువతకు బీజేపీ-ఆర్ఎస్‌ఎస్ నిజస్వరూపం తెలుసని ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. బీజేపీ-ఆర్ఎస్‌ఎస్ ఉద్దేశాల గురించి ఇంతకుముందు తెలియని వారు కూడా ఇప్పుడు ఆ విషయాన్ని గ్రహించారని పేర్కొన్నారు. పెల్లెట్ గన్స్ ప్రయోగంపై అమిత్ షా సమాధానం చెప్పాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లాఠీ చార్జ్ పై దర్యాప్తు చేయాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.