30 July, 2026 | 12:47 PM

వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ

30-07-2026 12:08 PM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ 

భూపాలపల్లి టౌన్, జూలై 30 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లో లెవల్ బ్రిడ్జిల వద్దకు వెళ్లవద్దని సూచించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయరాదని, ప్రజల భద్రత కోసం వరద ప్రభావిత ప్రాంతాలు, లో-లెవల్ బ్రిడ్జిల వద్ద జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్పీ కోరారు.