ఏసీబీకి చిక్కినా.. నేనింతే!?
- ఒక్కరోజులోనే సొంత జిల్లాకు పోస్టింగ్
- మొదట పెద్దపల్లి జిల్లాకు.. అదేరోజు మళ్లీ
- మంచిర్యాలకు పోస్టింగ్ తెప్పించుకున్న అసిస్టెంట్ డైరెక్టర్
- వెటర్నరీ డైరెక్టర్ తీరుపై సర్వత్రా విస్మయం
- ఈ సార్ మాకొద్దని వెటర్నరీ డైరెక్టర్‌కు ఫిర్యాదు
- భయాందోళనలో వెటర్నరీ ఉద్యోగులు
మంచిర్యాల, జూన్ 7 (విజయక్రాంతి): ఏసీబీకి చిక్కినా.. ఆ ఉన్నతాధికారి.. రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పాడు. నేనింతే!? నన్నే పట్టిస్తారా? నేనేంటో చూపిస్తా..? మీరు నన్ను తక్కువ అంచనా వేశారు? ఎట్లయినా తిరిగొస్తా..! అన్నుకున్నాడో.. ఏమో.. గానీ.. ఒక్క రోజులోనే ఏసీబీకి పట్టుబడ్డ జిల్లాలోనే తిరిగి ఉద్యోగం తెప్పించుకున్నాడు. ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌కు మొదట పెద్దపల్లి జిల్లాలో పోస్టింగ్ వచ్చినా.. అదేరోజు మళ్లీ మంచిర్యాల జిల్లాలో పోస్టింగ్ వేయించుకున్నాడంటే.. పైస్థాయిలో ఏమేరకు చక్రం తిప్పాడోనని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అంతేకాదు కిందిస్థాయి అధికారులు వణికపోతున్నట్లు సమాచారం. ప్రజాపాలనలో పైరవీల రాజ్యం నడుస్తోందని, 24 గంటల్లోనే ఏకంగా ఒక్కరికే రెండు పోస్టుంగ్‌లు ఇచ్చిన పశు సంవర్ధక శాఖ తీరుపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఈ సార్ మాకొదు.. మమ్మల్ని మళ్లీ వేధిస్తారు’ అని కిందిస్థాయి ఉద్యోగులు సమావేశమై.. వెటర్నరీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మంచిర్యాల జిల్లా పశు సంవర్ధక శాఖలో ఇన్‌చార్జి జిల్లా అధికారిగా విధులు నిర్వహించిన అసిస్టెంట్ డైరెక్టర్ ఈర్ల శంకర్, ఆయన కార్యాలయంలో, ఇంట్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి 3న ఒకేసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శంకర్‌తో పాటు ఆయన సతీమణి బ్యాంకు అకౌంట్లను సైతం తనిఖీ చేయగా, పశు సంవర్ధక శాఖలోని పలువురు ఉద్యోగులు ఏడీ శంకర్, ఆయన బంధువులకు డిజిటల్ పేమెంట్లు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఇంకా ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఏసీబీకి చిక్కి.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారికి మే 31వ తేదీన పెద్దపల్లి జిల్లా పశు వైద్యాధికారిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అదే రోజు మళ్లీ మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ (ఏవీహెచ్)కు ఏడీగా పోస్టింగ్ తెప్పించుకున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ ఈర్ల శంకర్. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో పలుకుబడిని ఉపయోగించు కొని ఒకసారి ఇచ్చిన ఉత్తర్వులను అదే రోజు మార్పించుకొని, ఎక్కడైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, ఏసీబీకి పట్టుబడ్డాడో అదే జిల్లాకు పోస్టింగ్ తెప్పించుకున్నాడు.
దీంతో జిల్లాలోని మండల స్థాయి అధికారులు గజగజా వణికిపోతున్నట్లు తెలిసింది. ‘ఆ అధికారిని ఏసీబీ పట్టించినది మేమేనన్న కోపంతో మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాడు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పగలిగిన వ్యక్తి... తప్పకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాడు’ అని భయాందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఇదే జిల్లాకు ఇప్పుడు పోస్టింగ్ రావడంతో గతంలో మాదిరిగానే మళ్లీ కక్షసాధింపు చర్యలు, వేధింపులు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో రెండు రోజుల కిందట జిల్లాలోని మండల స్థాయి అధికారులు, జిల్లా కార్యాలయంలోని కొందరు అధికారులు ఏకంగా సమావేశమై వెటర్నరీ శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏదీ ఏమైనా పశు సంవర్ధక శాఖలో మొదలైన గందరగోళ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాలి మరి.






