భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై మహేష్
30-07-2026 12:16 PM
సిర్గాపూర్ జులై 30(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సై మహేష్ ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మహేష్ సూచించారు. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు మినహా అవసరం లేని ప్రయాణాలు నివారించాలని తెలిపారు. తల్లిదండ్రులు చిన్నారులను నీటి ప్రవాహాల దగ్గరకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై మహేష్ కోరారు.






