5 August, 2026 | 4:41 AM

బొల్లారం గ్రామ పంచాయతీలో మహిళా గ్రామసభ నిర్వహణ

04-08-2026 05:24 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని బొల్లారం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ బద్దిగారి ప్రభుగౌడ్  అధ్యక్షతన మహిళా గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బద్దిగారి ప్రభుగౌడ్ మాట్లాడుతూ... గ్రామంలోని డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి రుణాలు పొంది చిన్నతరహా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అదేవిధంగా గ్రామంలోని మహిళా సంఘాల కోసం మహిళా సంఘం భవనం మంజూరైందని, ఆభవన నిర్మాణాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. భవనం పూర్తయిన అనంతరం డ్వాక్రా మహిళలు తమ సమావేశాలు,శిక్షణా కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలను సౌకర్యవంతంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి జి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ... మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు గ్రామ పరిశుభ్రత, ఆరోగ్యం, పారిశుధ్యం, దోమల నివారణ చర్యల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.