28 May, 2026 | 7:18 PM

ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్

28-05-2026 06:05 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో అందుబాటులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు'ను (UnifiedWelfareCard) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. అందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ సీఎస్ కె. రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టితో పాటు ఇతర ఉన్నతాధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చలు జరిపారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని సీఎం పేర్కొన్నారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని వివరించారు

ఈ విధానం అనుసరించడం వల్ల నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరుతాయని, అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని వెల్లడించారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సూచించారు. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని ఆదేశించారు. ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యాశాఖ, బీమా పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చేలా ఆలోచించాలని తెలిపారు.

ఇటీవల ప్రజా ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల SEEEPC సర్వే వివరాలను కూడా ఈ కార్డ్‌కు అనుసంధానం చేయాలన్నారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ జరగాలన్నారు. ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలని చెప్పారు.

ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో లింక్ చేయాలని వివరించారు. కేరళం నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.