17 August, 2026 | 2:13 AM

నాగేంద్రన్‌పై డీజీపీకి ఫిర్యాదు

17-08-2026 01:19 AM

సీఎం తల్లిపై అనుచిత వ్యాఖ్యలు, కఠిన చర్యలకు టీవీకే డిమాండ్

చెన్నై, ఆగస్టు 16: తమిళనాడు సీఎం విజయ్ తల్లిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ చేసి న అవమానకర వ్యాఖ్యలపై ఆదివారం టీవీకే (తమిళగ వెట్రి కజగం) పార్టీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. నాగేంద్రన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ చర్యలతోపాటు పరువు నష్టం, సంబంధిత చట్టం ప్రకారం డిజిటల్ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలని దర్యాప్తు చేపట్టి అతన్ని వెంటనే అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ వ్యాఖ్యలపై ఇటు సొంతపార్టీ నేతల్లో కూడా నాగేంద్రన్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తమిళనాడులో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం విజయ్ తల్లిపై నాగేంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ ఎంకే స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకొని పదే పదే నాన్న అని ప్రస్తావించారు.

ఈ వ్యాఖ్యలను నాగేంద్రన్ ఎగతాళి చేశారు. మరోవైపు నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ మర్యాదలను దాటాయని మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, రాజకీయ విభేదాలు, ప్రజాస్వామ్య చర్చలో చట్టబద్ధమైన అంశాలే అన్నారు. ఇందులో నాయకుడి కుటుంబాన్ని, అదీ మహిళ (తల్లి)ని లక్ష్యంగా చేసుకొని ఈ విధమైన విమర్శలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగం కాదన్నారు.