17 August, 2026 | 2:06 AM

దృష్టి మళ్లించేందుకే వందేమాతరం

17-08-2026 01:22 AM
  1. జాతీయ గీతంపై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం, గౌరవం
  2. భూ వివాదం, అయోధ్యపై తప్పించుకుంటున్న బీజేపీ
  3. కేపీసీసీ పునర్వ్యవస్థీకరణపై పార్టీదే తుది నిర్ణయం
  4. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్

తిరువనంతపురం, ఆగస్టు 16: జాతీయ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘వందేమాతరం’ ఆలపణ వివాదాన్ని బీజేపీ తెరపైకి తీసుకువస్తుందని  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. కాంగ్రెస్ వందేమాతరంను గౌరవించే పార్టీ అన్నారు. అయోధ్య, అరుణాచల్ భూవివాదం, మతతత్వం, కులతత్వం వంటి వాటితో రెచ్చగొట్టే రాజకీయాలను బీజేపీ చేస్తుందని వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కేరళలోని కరుణాగపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.

జాతీయగీతం వందేమాతరంపై కాంగ్రెస్‌కు స్పష్టమైన, దీర్ఘకాలిక వైఖరి ఉందన్నారు. మహాత్మాగాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ టాగూర్‌లతో సంప్రదింపుల ద్వారా వందేమాతరం రూపుదిద్దుకుందన్నారు. ఈ విషయంలో బీజేపీ కావాలనే రాజకీయ రంగు పులుముతుందని విమర్శించారు. ప్రాదేశిక సమస్యలను ప్రధాని మోదీ పక్కన పెడుతున్నారని ఆరోపించారు. రామ మందిర నిధులు, చైనా స్వాధీనం చేసుకున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని భూభాగాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రశ్నిస్తుంటే వాటి నుంచి తప్పించుకునేందుకు జాతీయగీతం అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు.

కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రతిపాదిత పునర్వ్యవస్థీకరణపై వేణుగోపాల్ మాట్లాడుతూ.. మంత్రి కూడా అయిన ప్రస్తుత అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ సంస్థాగత బాధ్యతల నుంచి విముక్తి పొందాలని కోరుకున్నారని అంగీకరించారు. అయితే ఆయన పదవిలో కొనసాగుతున్నారని, పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.