భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
తెలంగాణ రైతు సంఘం డిమాండ్
ములకలపల్లి, మార్చి 17 (విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కి భూమి సేకరిస్తున్న నేపథ్యంలో నిర్వాసితులకు 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ డిమాండ్ చేశారు.మంగళవారం ములకలపల్లి లో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశం లక్ష్మీ నర్సు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 చట్ట ప్రకారం ఎకరానికి 24 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ప్రాంతం గుండా వెళుతున్న ప్రధాన కాలువకి గతంలో కేవలం ఎనిమిది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఖమ్మం ప్రాంతంలో 18 నుంచి 24 లక్షల రూపాయలు వరకు చెల్లిస్తున్నారని ఇది ప్రాంతాల మధ్యన అసమానతలు తీసుకురావడానికి దోహదపడుతుందన్నారు. ఈ సమావేశాల్లోనే సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ కెనాల్సికి పూర్తినిధులు కేటాయించి సత్వరం పనులు పూర్తిచేసి వచ్చే సీజన్ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్, మండల నాయకులు గోపగాని లక్ష్మీ నర్సయ్య,వర్షా శ్రీరాములు, కురం ప్రభాకర్,ప్రసాదు,నారాయణ, భూక్యా శ్రీదేవి, పుప్పాల హరినాథ్, హేమాని పాల్గొన్నారు.




