ఐదుగురికి కారుణ్య ఉద్యోగ నియామకాలు
ములుగు (మహబూబాబాద్) మే 25 (విజయక్రాంతి): ఉద్యోగంలో ఉన్న సమయంలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కారుణ్య నియామకాల విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నదని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు తో కలిసి కారుణ్య నియామకాల ద్వారా అర్హులైన ఐదుగురికి ములుగు జిల్లా పరిధిలోని వివిధ మండల పరిషత్ కార్యాలయాలలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులలో నియామక ఉత్తర్వులు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నిబంధనల ప్రకారం న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఈ నియామకాలతో సంబంధిత కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం లభించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, ఆర్డీవో వెంకటేష్, డీఎస్పీ కిషోర్, జిల్లా అధికారులు, సీడీపీఓలు, మండలాల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






